గత కొన్ని రోజులుగా దేశంలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎండ 50 డిగ్రీలు దాటిపోయి.. దేశంలో 5 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ.. నైరుతి రుతుపవనాల గురించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. గురువారం నైరుతి రుతుపవనాలు.. కేరళలోకి ప్రవేశించనున్నాయని తెలిపింది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు కూడా నైరుతి రుతుపవనాలు ఎప్పుడు వస్తాయన్న విషయాన్ని ఐఎండీ వెల్లడించింది.
రాబోయే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని తాజాగా భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తాజాగా వెల్లడించారు. నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ముందే కేరళలలో అనుకూల పరిస్థితి ఉందని తాజాగా ఐఎండీ అంచనా వేసింది. కేరళతోపాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాల ఆగమనం ఉంటుందని ఐఎండీ డీజీ బుధవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. వాయవ్య, మధ్య భారతదేశ రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీగా హీట్ వేవ్ పరిస్థితులకు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉందని తెలిపింది.
రుతుపవనాల ఆగమనంతో వచ్చే 3, 4 రోజుల్లో వాయువ్య, మధ్య భారతదేశ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా తగ్గే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గత ఏడాది నైరుతి రుతుపవనాలు వారం ఆలస్యంగా జూన్ 8 వ తేదీన కేరళను తాకాయని పేర్కొంది. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాలు జూన్ 1 వ తేదీన ప్రారంభమై.. ఆ తర్వాత ఉత్తరం వైపుగా కదులుతూ జూలై 15 వ తేదీ నాటికి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తాయి. నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఈశాన్య భారతదేశంలో జూన్ 5 వ తేదీ నాటికి విస్తరిస్తాయి. ఇక ఇప్పటికే కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇక నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించిన తర్వాత 5, 6 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల కదలికల ఆధారంగా.. అవి దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి ప్రవేశించే సమయం ఆధారపడి ఉంటుంది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదిలితే.. అంతే వేగంగా దేశం మొత్తం రుతుపవనాలు వ్యాపిస్తాయి. ఇక దేశంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ఇటీవలే మీడియాకు వెల్లడించారు.