మనుషుల్లో రోజురోజుకూ మానవత్వం నశిస్తోంది అని చెప్పడానికి నిత్యం మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రమాదంలో ఉన్న వారిని రక్షించకుండా తమ దారి తాము చూసుకునే వాళ్లను మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తాజాగా అలాంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం సీసాలతో వెళ్తున్న ఓ ట్రక్కు.. రహదారిపై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆ ట్రక్కు డ్రైవర్ గాయపడగా.. అందులో ఉన్న మద్యం సీసాలు మొత్తం నడిరోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే అది గమనించిన మిగిలిన వాహనదారులు, స్థానికులు.. ఆ డ్రైవర్‌ను కాపాడటం పక్కన పెట్టి.. మందు సీసాలు ఎత్తుకెళ్లే పనిలో పడ్డారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో చోటు చేసుకుంది.
బిజ్నోర్ జిల్లాలోని మండవాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నజీబాబాద్ హైవేపై జత్‌పురా బోండా గ్రామం సమీపంలో మందు బాటిళ్ల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున హైవేపై వెళ్తున్న ఆ డీసీఎం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఆ తర్వాత మరో గుర్తు తెలియని వాహనాన్ని కూడా ఢీకొట్టింది. అయితే డీసీఎం వేగంగా వెళ్తుండగా.. ఒక్కసారిగా హైవేపైకి ఆవు రాగానే దాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఈ మద్యం ట్రక్కు ప్రమాదానికి గురైన తర్వాత.. చుట్టుపక్కలవారు, ఇతర వాహనదారులు.. గాయపడిన డ్రైవర్‌ను వదిలేసి.. రోడ్డుపై పడిపోయిన మద్యం బాటిళ్లను దోచుకునే పనిలో పడ్డారు. అయితే ఆ డీసీఎంలో స్థానిక మద్యం మాత్రమే కాకుండా ఫారిన్ సరుకు కూడా ఉండటంతో స్థానికులు ఆ మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లేందుకు ఎగబడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది తెగ వైరల్‌గా మారింది.
చాలా మద్యం సీసాలు పగిలి రోడ్డుపై మద్యం వరద పారగా.. కొన్ని బాటిళ్లు మాత్రం పగలకుండా అలాగే ఉన్నాయి. వాటిని తీసుకెళ్లేందుకు అక్కడ ఉన్నవారు ఎగబడటం గమనార్హం. డ్రైవర్ గాయపడి రక్తంతో తడిసిపోయి ఉన్నా.. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించకుండా మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లడంతో.. స్థానికుల ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.