రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే దుర్మరణం పాలయ్యారు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ టికెట్ నిరాకరించగా.. ఆయన సిట్టింగ్ స్థానం కైసర్‌గంజ్‌ను అతని కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌కు ఈసారి ఇచ్చింది. ఈ క్రమంలోనే కైసర్‌గంజ్ నియోజకవర్గంలో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20 వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సంఘటన వెలుగుచూడటం తీవ్ర సంచలనంగా మారింది.
కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌లోని యూపీ 32 హెచ్‌డబ్ల్యూ 1800 నంబరు గల టయోటా ఫార్చ్యూనర్ కారు బుధవారం ఉదయం 9 గంటల సమయంలో అతి వేగంతో వెళ్తూ ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హుజూర్‌పూర్-బహ్రైచ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో గోండా వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న 17 ఏళ్ల రెహాన్.. 24 ఏళ్ల షెహజాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 65 ఏళ్ల వృద్ధురాలు సహా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరి పడిపోయారు.
ప్రమాదానికి కారణం అయిన ఆ టయోటా ఫార్చ్యూనర్ కారుపై పోలీస్ ఎస్కార్ట్ అని రాసి ఉంది. ఈ ఘటనలో ఆ కారు ముందు భాగం తీవ్రంగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదం జరగ్గానే ఆ కారు ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో.. డ్రైవర్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ కారులో ఉన్న వారు అక్కడి నుంచి పరారయ్యరు. అయితే ఈ యాక్సిడెంట్ సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కరణ్ భూషణ్ సింగ్ ఆ కారులో ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
ఇక ఈ సంఘటన తెలిసిన స్థానికులు.. గాయపడినవారు చికిత్స పొందుతున్న ఆస్పత్రిని ముట్టడించారు. బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ ప్రమాదంలో మృతుడు రెహాన్ ఖాన్ తల్లి చందాబేగం.. కల్నల్‌గంజ్ కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.