సుబ్రమణ్వస్వామి ఆలయంలోకి ప్రవేశించిన నెమలి.. గుర్బగుడి ముందు నిలబడి పూజ అయ్యేంత వరకూ అక్కడ ఉండిపోయింది. అంతేకాదు, పూజ అనంతరం భక్తులకు ఇచ్చిన మాదిరిగానే నెమలికి హారతి ఇచ్చారు. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. సాక్షాత్తు కార్తికేయుడి వాహనమైన నెమలి ఆలయంలోకి వచ్చి పూజలో పాల్గొనడంతో ఇదంత దేవుడి మహిమగా భావించారు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో రెండు రోజుల కిందట ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మే 27న తిరుప్పూర్ జిల్లా పల్లడంలో ఉన్న మురుగన్ ఆలయంలోకి ఓ మయూరం వచ్చి.. సుబ్రహ్మణ్యేశ్వరుడి పూజలో పాల్గొంది. గర్భగుడి ముందు నిలబడిన ఆ నెమలి.. పూజ పూర్తయ్యేంత వరకూ చూస్తూ అక్కడే ఉండిపోయింది. అభిషేకం వంటి కైంకర్యాలు ముగిసిన అనంతరం ఆలయ పూజారులు.. ఇతర భక్తులకు ఇచ్చినట్టుగానే ఆ పక్షిరాజానికి కూడా హారతి ఇచ్చారు. ఆ సమయంలో దాని కళ్లలో ఓ రకమైన సంతృప్తి కనిపించింది. అనంతరం ఆ నెమలి ఆలయం నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ అద్బుతాన్ని చూసిన ఆలయానికి వచ్చిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక, సుబ్రహ్మణ్యస్వామిని సర్పాలకు అధిదేవతగా భావిస్తారు. ఆయన వాహనం నెమలి. రెండు విరుద్ధ భావనలు, ధర్మాలను ఒక్కతాటిపై సమంగా నిలిపే శక్తి దైవానికి ఉందని చెప్పడమే ఇందులో పరమార్ధం. అందుకే నెమలి వాహనుడైన కుమారస్వామి సర్పాలకు అధిదేవతగా అనుగ్రహిస్తున్నాడు. ఇక, అహం అంతర్గతంగా ఉన్నంత వరకు సమస్య లేదని, అది బయటపెడితే కోరికలు పుట్టుకొచ్చి, అనేక చెడు పరిణామాలకు దారితీస్తాయి.. పాము అనే అహంకారాన్ని పాదాల కింద ఉంచి, దానిని నియంత్రించడం ద్వారా బాహ్య సౌందర్యం నుంచి దృష్టి మరల్చి భగవంతుడిని తెలుసుకోవాలనే తత్వాన్ని నెమలి వాహనం తెలియజేస్తుంది.