రఫాపై ఆదివారం రాత్రి నుంచి ఇజ్రాయేల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 45 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయపడ్డారు. ఇప్పటి వరకూ గాజాపై యుద్ధంలో అత్యంత పాశవిక దాడుల్లో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నారు. రఫాపై ఆపరేషన్ నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన మర్నాడే ఇజ్రాయేల్ ఈ దారుణానికి పాల్పడింది. ఇజ్రాయేల్ తీరుపై అమెరికా సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రఫాలో చిన్నారులు, మహిళల మరణాలపై అమెరికా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ దాడి దృశ్యాలు కలచివేసేలా ఉన్నాయని పేర్కొంది.
టెల్ అవీవ్ దిశగా హమాస్ రాకెట్‌లు ప్రయోగించిన కొద్ది గంటల్లోనే రఫాపై ఇజ్రాయేల్ దాడులు చేపట్టింది. గాజాలో యుద్ధం మొదలైన తర్వాత తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షితమైందిగా ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో తమ ప్రాణాలను రక్షించుకోడానికి వేలాది మంది ఇక్కడకు వచ్చి తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రాంతంపైనే దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అయినప్పటికీ.. ఇజ్రాయేల్ దాడులు కొనసాగిస్తోంది. సోమవారం, మంగళవారం మరో 37 మంది పాలస్తీనీయన్లు మృతి చెందడం శోచనీయం.
గాజాలో ఇజ్రాయేల్ మారణకాండకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు, సెలబ్రిటీలు మద్దతుగా పోస్ట్‌లు పెడుతున్నారు. కొనసాగుతోన్న హమాస్-ఇజ్రాయేల్ యుద్ధంపై అవగాహనకు పిలుపునిస్తున్నారు. ఈ నెల ఆరంభంలో సరిహద్దులో ఇజ్రాయేల్ సైనిక దాడిని ముమ్మరం చేసి, స్వాధీనం చేసుకునే ముందు వరకూ మానవతా సహాయం కోసం రఫా ప్రధాన ప్రవేశ కేంద్రంగా ఉంది. సురక్షిత ప్రాంతంగా భావించిన రఫాపై దాడులతో అక్కడ ఉన్న 10 లక్షల మందికిపైగా ప్రజలు వలసబాటపట్టారు.
ఇక, రఫాపై దాడుల గురించి వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి వ్యూహాత్మక సమాచారం విభాగం కో-ఆర్డినేటర్ జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ‘రఫాలో ఇజ్రాయేల్ సైన్యం జరిపిన దాడుల్లో సామాన్య పౌరులు పదుల సంఖ్యలో మరణించిన దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ చూస్తుంటే హృదయం ద్రవించుకుపోతోంది. చాలా భయానకంగా ఉన్నాయి.. హమాస్‌తో జరుగుతున్న ఈ యుద్ధం సామాన్యులకు ఎలాంటి కీడు జరగొద్దు. హమాస్‌కు బుద్ధిచెప్పే హక్కు ఇజ్రాయేల్‌కు ఉన్నప్పటికీ సామాన్యులకు ఎలాంటి ముప్పు కలిగించరాదు.. అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హమాస్ కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది.. అదే సమయంలో పౌరుల ప్రాణాలు కూడా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని అన్నారు.