విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ యువకుడు వీరంగం వేశాడు. ఒంటిమీద బట్టలన్నీ విప్పేసి నగ్నంగా పరుగులు పెడుతూ హడలెత్తించాడు. అడ్డుకోడానికి ప్రయత్నించిన క్యాబిన్ సిబ్బందిని కూడా కిందకు తోసేశాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారు. ఈ ఘటన పెర్త్ నుంచి మెల్‌బోర్న్‌కు వెళ్తోన్న వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వర్జిన్ ఆస్ట్రేలియాకు చెందిన వీఏ696 విమానం పెర్త్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి, నగ్నంగా అటూ, ఇటూ పరిగెత్తాడు.
అడ్డుకోడానికి ప్రయత్నించిన సిబ్బందిని కింద పడేశాడు. అతడి విపరీత చర్యలకు తోటి ప్రయాణికులు హడలిపోయారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. పెర్త్ విమానాశ్రయంలో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని హాస్పిటల్‌కు తరలించారు. వర్జిన్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. సాధారణంగా పెర్త్ నుంచి మెల్‌బోర్న్‌కు ప్రయాణ సమయం మూడున్నర గంటలు పడుతుందని తెలిపారు. కానీ, ప్రయాణికుడు నిర్వాకంతో తిరిగి వెనక్కి మళ్లించడం వల్ల మరో గంట ఆలస్యమైందన్నారు.
ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే తమ మొదటి ప్రాధాన్యత అని, ఓ వ్యక్తి విపరీత చేష్టల కారణంగా విమానం ఆలస్యమైనందకు చింతిస్తున్నామని అతడు తెలిపారు. విమానంలో ప్రయాణించిన స్టెర్లింగ్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘విమానంలో అకస్మాత్తుగా ఆ వ్యక్తికి బట్టలు లేకుండా ముందుకు వెనక్కు తిరుగుతున్నాడు.. కాక్‌పిట్ వైపు ఎవరో పరుగెత్తుతున్న దృశ్యాన్ని చూసి తాను మొదట ఆందోళనకు గురయ్యాను.. అతడు సిబ్బంది కిందకు తోసేశాడు.. కాక్‌పీట్ వద్ద పెద్దగా అరుస్తూ హడలెత్తించాడు ’ అని అన్నాడు. తమపై దాడి చేస్తాడేమోనని భయపడ్డామని, కానీ అదృష్టవశాత్తూ అలా జరగలేదన్నాడు. బిజినెస్ క్లాస్‌లో ఉన్న ఓ పెద్దాయన జోక్యం చేసుకోవడంతో మరో ఇద్దరు ఆయనకు సాయంగా వచ్చారు. అనంతరం అతడ్ని పట్టుకోవడంతో సిబ్బంది హ్యాండ్‌కఫ్ వేసి బంధించారు.