భారత్‌తో 1999 నాటి లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించామని, ఇది పూర్తిగా తమ తప్పిదమేనని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మంగళవారం అంగీకరించారు. ఈ ఉల్లంఘనే కార్గిల్ యుద్ధానికి దారితీసిందని ఆయన వ్యాఖ్యానించారు. 98లో పాకిస్థాన్ వరుస అణ్వస్త్ర పరీక్షల అనంతరం 1999లో నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి లాహోర్‌కు వెళ్లి.. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ఒప్పందం చేసుకున్నారు. ‘1998 మే 28న పాకిస్థాన్ ఐదు అణు పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత వాజ్‌పేయి సాహెబ్ ఇక్కడకు వచ్చి మాతో ఒప్పందం కుదుర్చుకున్నారు... కానీ ఆ ఒప్పందాన్ని మేము ఉల్లంఘించాం... అది పూర్తి మా తప్పే’’ అని పార్టీ సమావేశంలో ఆయన అన్నారు.
పాక్ సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించిన తర్వాత పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయనను తిరిగి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మూడుసార్లు పాక్ ప్రధాని పదవి చేపట్టిన నవాజ్.. పనామా పత్రాల కేసులో ఆరోపణలతో తప్పుకోవాల్సి వచ్చింది. అవినీతి ఆరోపణలతో దేశం విడిచి లండన్‌కు ప్రవాసం వెళ్లిపోయారు. తిరిగి 2023 అక్టోబర్‌లోనే స్వదేశానికి తిరిగొచ్చారు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ పార్టీ బాధ్యతలు చేపట్టారు..
అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే లాహోర్ పర్యటనకు వెళ్లిన ఆయన.. పాక్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి, స్థిరత్వానికి సంబంధించి లాహోర్ డిక్లరేషన్‌పై ఇరువురు ప్రధానులు సంతకాలు చేశాయి. కానీ, ఈ కొద్ది నెలలకే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిన దాయాది.. కార్గిల్‌పై దొంగదెబ్బ తీసి యుద్ధానికి కారణమైంది.
ఇక, అణ్వస్త్ర పరీక్షల సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు తమకు 5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్టు నవాజ్ షరీఫ్ వెల్లడించారు.‘‘అణు పరీక్షలను ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేశారు., కానీ నేను అందుకు నిరాకరించాను. ఒక వ్యక్తి (మాజీ ప్రధాని) ఇమ్రాన్ ఖాన్ నా స్థానంలో ఉండుంటే క్లింటన్ ఆఫర్‌ను అంగీకరించి ఉండేవాడు’ అని పాక్ మొదటి అణుపరీక్ష నిర్వహించి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే, 2017లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సాకిబ్ నిసార్ తప్పుడు కేసులో తనను పదవి నుంచి ఎలా తొలంగించారో పాక్ మాజీ ప్రధాని వివరించారు. తనపై ఉన్నవన్నీ తప్పుడు కేసులని, కానీ, మాజీ ప్రధాని ఇమ్రాన్‌పై ఉన్న కేసులు నిజమైనవని అన్నారు.
2017లో తన ప్రభుత్వాన్ని పడగొట్టి, ఇమ్రాన్ ఖాన్‌ని ప్రధాని పీఠం కూర్చోబెట్టడానికి ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ జహీరుల్ ఇస్లామ్ చేసిన కుట్రలను నవాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా తనను ఐఎస్ఐ నియమించలేదనే విషయాన్ని కొట్టి పారేయాలని ఇమ్రాన్ ఖాన్‌కి సవాల్ విసిరారు. ప్రధాని పదవికి (2014లో) రాజీనామా చేయమని జనరల్ ఇస్లాం నుంచి అందిన ఆదేశాల గురించి ఆయన ప్రస్తావించారు. ‘‘నేను ఆ ఆదేశాలు నిరాకరించడంతో నన్ను బెదిరించాడు’’ అని నవాజ్ షరీఫ్ వివరించారు. కష్టసమయంలో తన సోదరుడు, ప్రస్తుత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అండగా నిలిచారని కొనియాడారు. తమ మధ్య విబేధాలను సృష్టించే ప్రయత్నాలు జరిగాయని, కానీ షెహబాజ్ తనకు విధేయుడని నవాజ్ వ్యాఖ్యానించారు.