ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోర్న్‌స్టార్‌తో చీకటి ఒప్పందం.. 34 ఆరోపణల్లో దోషిగా డొనాల్డ్ ట్రంప్

international |  Suryaa Desk  | Published : Fri, May 31, 2024, 10:33 PM

అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో చేరనుంది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో చీకటి ఒప్పందం కేసులో డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన అన్ని అభియోగాల్లోనూ న్యూయార్క్ జ్యూరీ ఆయనను దోషిగా నిర్దారించింది. దీంతో అమెరికా చరిత్రలోనే క్రిమినల్ చర్యలు ఎదుర్కొని, దోషిగా నిర్దారణ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కనున్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో తమ ఇద్దరి మధ్య సంబంధం గురించి బయటపెట్టకుండా ఉండేందుకు డేనియల్స్‌‌తో ఒప్పందం చేసుకున్న ట్రంప్.. ఆమెకు పెద్ద మొత్తంలో నగదు అందజేశారనేది ప్రధాన ఆరోపణ.


ఈ కేసులో జ్యూరీ దోషిగా నిర్ధారించడంతో ఆయనకు గరిష్టంగా నాలుగేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధవుతోన్న ట్రంప్‌నకు భారీ ఎదురుదెబ్బే అవుతుంది. అయితే, అప్పీల్‌కు కోర్టు అనుమతించడంతో ట్రంప్ బెయిల్ లేకుండా విడుదలయ్యారు. ఒకవేళ జైలుకు వెళ్లినా ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకుండా అడ్డుకోవడం కుదరదు. ఇక, ట్రంప్ మాత్రం తాను అమాయకుణ్ణి అని, ఎటువంటి తప్పుచేయలేదని అంటున్నారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలేనని, నిజమైన తీర్పు ప్రజల నుంచి వస్తుందని అన్నారు.


ఈ తీర్పుపై అధ్యక్షుడు జో బైడెన్ బృందం స్పందిస్తూ.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ప్రకటన చేసింది. మన ప్రజాస్వామ్యానికి ఎన్నడూ లేనంగా ట్రంప్ ముప్పు ఉందని ఆరోపించింది. ఇక, ఈ కేసులో దోషిగా నిర్దారణ అయిన డొనాల్డ్ ట్రంప్‌నకు జులై 11న శిక్ష ఖరారు చేయనున్నట్టు న్యాయమూర్తి జువాన్ మెర్చన్ వెల్లడించారు. రిపబ్లికన్ పార్టీ ట్రంప్‌ను అధికారింగా అధ్యక్ష ఎన్నికలకు పేరు ఖరారు చేయడానికి మిల్‌వాకూలో నిర్వహించే నేషనల్ కన్వెన్షన్‌కు నాలుగు రోజుల ముందే ఆయనకు శిక్ష ఖరారు కానుండటం గమనార్హం.


ఇక, ఏకగ్రీవంగా తీర్పును వెల్లడించడానికి ముందు 12 మంది సభ్యులు న్యాయమూర్తులు బృందం రెండు రోజుల పాటు 11 గంటలకుపైగా చర్చించింది. అత్యంత క్లిష్టమైన ప్రక్రియను పూర్తిచేసినందుకు జ్యూరీ సభ్యులకు జువాన్ మెర్చన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, కేసు విచారణ పూర్తయ్యేవరకూ జ్యూరీ సభ్యులు వివరాలను రహస్యంగా ఉంచారు. మాఫియా లేదా ఇతర హింసాత్మక కేసుల్లో ఇలా అరుదుగా వ్యవహరిస్తారు. మరోవైపు, 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర పన్నారని, వైట్‌హౌస్‌ను విడిచిపెట్టిన తర్వాత రహస్య పత్రాలను తీసుకెళ్లారని ట్రంప్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా ఫెడరల్ పోలీసుల విచారణను ట్రంప్ ఎదుర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com