పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచిన చోరీకి గురైన ద్విచక్రవాహనాలు, కార్లు ఒక్కొక్కటిగా మాయం కావడంతో అధికారులు ఖంగుతిన్నారు. అయితే, దీని వెనుక ఇంటి దొంగ ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తినా పట్టించుకోలేదు. కానీ, దీనిపై స్థానిక మీడియా స్టింగ్ ఆపరేషన్ చేపట్టడంతో ఓ సీనియర్ పోలీస్ అధికారి నిర్వాకం బయటపడింది. బైక్‌లను డీఎస్పీ స్థాయి అధికారి అమ్ముకుంటున్నట్టు తెలిసి వారంతా అవాక్కయ్యారు. కంచే చేను మేసిన చందంగా పోలీస్ అధికారి చోరీ బైక్‌లకు అమ్ముకున్న ఘటన పాకిస్థాన్‌లోని కరాచీలో వెలుగులోకి వచ్చింది. కరాచీలోని యాంటీ-వెహికల్ లిఫ్టింగ్ సెల్ డీఎస్పీ నిజ్‌బత్ హుస్సేన్ బండారం బయటపడింది.
దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న బైక్‌లను వాటి యజమానులకు అప్పగించకుండా డీఎస్పీ హుస్సేన్ రహస్యంగా అమ్ముకుంటున్నట్లు స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడయ్యింది. చోరీల వెనుక డీఎస్పీ హుస్సేన్ పాత్రపై పలు ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్థానిక మీడియా ఆర్య న్యూస్‌కు చెంది సార్-ఎ-ఆమ్ బృందం స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. కస్టమర్ల మాదిరిగా రెండు బైక్‌లను కొన్న ఈ బృందం.. ఈ సందర్భంగా డీఎస్పీ సంభాషణలు, అక్రమ లావాదేవీలను రికార్డు చేసింది. నిందితుడికి అనుమానం రాకుండా బడ్జెట్ పరిమితి కారణంగా చోరీ బైక్‌లు తక్కువకు వస్తాయని, అందుకే వాటిని తాము కొనాలని భావిస్తున్నట్టు అబద్దం చెప్పారు.
దీంతో వారికి రెండు బైక్‌లను ఇచ్చేందుకు డీఎస్సీ అంగీకరించాడు. చివరకు బైక్‌లు, కార్లను డీఎస్పీ విక్రయిస్తూ చేతివాటం ప్రదర్శిస్తోన్న విషయం బయటపడింది. ఈ స్టింగ్ ఆపరేషన్ పోలీసు శాఖలో కలకలం రేపింది. ఈ అంశంపై సీనియర్ ఎస్పీ ఆరిఫ్ అస్లాం రావు తక్షణమే స్పందించారు. డీఎస్పీ నిజబత్ హుస్సేన్‌ను విధుల నుంచి తప్పించి విచారణ ప్రారంభించారు. ఈ సంఘటన చట్టాన్ని అమలు చేసే కొంతమంది అధికారుల చిత్తశుద్ధిపై అనుమానాలు కలిగించడమే కాకుండా నేర కార్యకలాపాలలో వారి పాత్రను నొక్కి చెబుతుంది. ఈ ఏడాది మార్చిలోనూ సింధ్ ప్రాంతంలో అహ్మద్ కరీమ్ జిలానీ అనే డీఐజీ.. గుట్కా, ఇతర డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయనను విధుల నుంచి తప్పించిన ఐజీ రిఫత్ ముఖ్తార్.. విచారణకు ఆదేశించారు.