ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణ కొరియాపై కిమ్ ప్రతీకారం.. క్షిపణులు, బాంబులతోనో కాదు ‘చెత్త’తో!

international |  Suryaa Desk  | Published : Fri, May 31, 2024, 10:36 PM

గత ఏడు దశాబ్దాలుగా ఉభయ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. అమెరికాతో దక్షిణ కొరియా చెట్టపట్టాలేసుకుని తిరగడం ఉత్తర కొరియాకు మరింత కంటగింపుగా మారింది. అగ్రరాజ్యంతో కలిసి దాయాది సైనిక విన్యాసాలపై కిమ్ జోంగ్ ఉన్ మరింత రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో తరచూ క్షిపణి, రాకెట్ ప్రయోగాలతో కవ్వింపులకు పాల్పడుతున్నారు. తాజాగా, పొరుగుదేశంపై మరోసారి ప్రతీకార చర్యలకు దిగారు కిమ్. కానీ, ఈసారి క్షిపణులు, బాంబులతో మాత్రం కాదు. బెలూన్ల ద్వారా తమ దేశంలోని చెత్తను దక్షిణ కొరియాలో జారవిడిచి ప్రతీకారం తీర్చుకుంటున్నారు.


మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ ఉత్తర కొరియా నుంచి తమ భూభాగంలోకి భారీ బెలూన్లు వచ్చినట్టు గుర్తించింది దక్షిణ కొరియా సైన్యం. సరిహద్దులతో పాటు సియోల్‌, జియోంగ్సాంగ్‌ ప్రావిన్సుల్లోని రహదారులపై ఇవి దర్శనమిచ్చినట్టు తెలిపింది. మొత్తంగా ఇలాంటివి 260 భారీ బెలూన్లు వచ్చినట్లు తెలుస్తోంది ఈ బెలూన్లలోని బ్యాగుల్లో వాడి పడేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లు, బ్యాటరీలు, పాడైపోయిన షూలు, పాత పేపర్లతో కూడిన చెత్త ఉంది. కొన్ని బెలూన్లలో జంతు విసర్జనలు కూడా ఉండటం గమనార్హం. పదుల సంఖ్యలో చెత్త బెలూన్లు వస్తుండటంతో దక్షిణ కొరియా అప్రమత్తమైంది. భద్రతా బలగాలు, బాంబు స్క్యాడ్‌లు, ఇతర నిపుణులను రంగంలోకి దింపింది.


ఈ బెలూన్లను విశ్లేషిస్తోన్న దక్షిణ కొరియా.. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి తెలియజేసింది. అలాగే, అనుమానాస్పద వస్తువులపై స్థానిక ప్రజలను దక్షిణ కొరియా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వాటిలోని వస్తువులతో నివాసాలు, విమానాశ్రయాలు, రహదారులకు ప్రమాదమేనని హెచ్చరించింది. ఉత్తర కొరియా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, తమ ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు కలిగించేవేనని దక్షిణ కొరియా మండిపడింది. వీటివల్ల ఉత్పన్నమయ్యే పర్యవసానాలకు కిమ్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇలాంటి అమానవీయ, చిల్లర పనులను తక్షణమే ఆపాలని స్పష్టం చేసింది. తమ సహనాన్ని పరీక్షించాలని కోరుకుంటోందని.. దీనిపై తమ ప్రతిస్పందన మెల్లగా ఉంటుందని ఉద్ఘాటించింది.


ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ యో జోంగ్ తమ చర్యలను సమర్దించుకోవడం గమనార్హం. ఇది‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’ అని పేర్కొన్నారు. ‘కొరియా సరిహద్దు, మధ్య ప్రాంతాల వెంబడి బెలూన్‌లకు అమర్చిన బ్యాగ్‌లలో టాయిలెట్ పేపర్లు, ఇతర వ్యర్థాలను ఉత్తర కొరియా డంపింగ్ చేసిందని ఆ దేశ అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక, జోంగ్ మాత్రం అనేక సంవత్సరాలుగా ఉత్తర కొరియా వ్యతిరేక కరపత్రాలతో కూడిన బెలూన్‌లను దక్షిణ కొరియా పంపుతోన్న చర్యతో పోల్చారు. ‘వాళ్లు తరుచూగా చేసే కొన్ని పనులను మేము చేశాం.. కానీ వారు అగ్ని వర్షం కురిసినట్టు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో నాకు తెలియదు’ అని కిమ్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com