శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడైన దగ్గర నుంచి దేశం మొత్తం ఇప్పుడు దానిమీదే చర్చ నడుస్తోంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు.. తమ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్నిసీట్లు గెలుస్తుందంటూ ఆయా రాష్ట్రాల ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇక ఏపీలో అయితే ఈ హడావిడి మరింత ఎక్కువగా ఉంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు.. ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డి పోరాడాయి. వైనాట్ 175 అంటూ వైసీపీ రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో పోరాడగా.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న టీడీపీ.. ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో కూటమిగా పోటీ చేసింది.
అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఏపీలో ఎవరు గెలుస్తారనే దానిపై కచ్చితమైన అంచనాను చెప్పలేకపోయాయనే చెప్పొచ్చు. ఆరా మస్తాన్ వంటి సర్వే ఏజెన్సీలు వైసీపీదే అధికారమని తేల్చగా.. రైజ్, పీపుల్స్ పల్స్, చాణక్య ఎక్స్ వంటి సంస్థలు కూటమిదే విజయమని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఏ సర్వే సరైన ఫలితాన్ని అంచనా వేసిందనే అయోమయంలో ఏపీ జనం పడిపోయారు. దీనిపై క్లారిటీ రావాలంటే జూన్ నాలుగో తేదీ వరకూ ఆగాల్సిందే. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తర్వాత స్పందించారు. తన దృష్టిలో ఇదే అత్యంత కచ్చితమైన ఎగ్జిట్ పోల్ సర్వే అంటూ ఆర్జీవీ ఓ ట్వీట్ వదిలారు.
సిరా శ్రీ అనే ఎక్స్ యూజర్ తన ఎక్స్ ఖాతాలో ఏపీ ఎన్నికలపై నా ఎగ్జి్ట్ పోల్ అంటూ ఓ ట్వీట్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఏపీ లోక్ సభ ఎన్నికలు అంటూ వేర్వేరుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంటూ ట్వీట్ చేశారు. అయితే వైసీపీ, కూటమి ఏదైనా 0 నుంచి 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవవచ్చని.. అలాగే లోక్ సభ విషయానికి వస్తే వైసీపీ, టీడీపీ కూటమి ఏదైనా సున్నా నుంచి 25 స్థానాల మధ్య గెలవొచ్చంటూ ఫన్నీ ఎగ్జిట్ పోల్స్ ట్వీట్ చేశారు. ఏ సర్వే అయినా అంచనా తప్పు కావచ్చేమో కానీ.. నా అంచనా మాత్రం వందశాతం కరెక్ట్ అవుతుందంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఇదే ట్వీట్‌ను రీట్వీట్ చేసిన ఆర్జీవీ.. ఇదే అత్యంత కచ్చితమైన సర్వే అంటూ రాసుకొచ్చారు.
రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే .. ఆయన వైఎస్ జగన్ అభిమాని అని అందరికీ తెలిసిందే. వైసీపీకి మద్దతుగా ఆయన పోస్టులు, ట్వీట్లు పెడుతుంటారు. అలాగే వైఎస్ జగన్ బయోపిక్ సైతం సినిమాలుగా రూపొందించి విడుదల చేశారు వర్మ. ఈ క్రమంలోనే టీడీపీతోనూ, టీడీపీ నేతలతోనూ వైరం పెంచుకున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అనేక జాతీయ సంస్థలు కూటమికి మద్దతుగా ఫలితాలను ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.