ఓట్ల లెక్కింపులో ప్రప్రథమంగా ఈవీఎంల ద్వారా కౌంటింగ్ చేసిన తొలి రౌండ్ ఫలితమే ముందుగా వెలువడుతుంది. పోస్టల్‌బ్యాలెట్ ఓట్లు లెక్కింపు అరగంట ముందే ప్రారంభమౌతుందని, దీనివల్ల వాటి ఫలితాలే ముందు వస్తాయని చాలామంది అపోహలకు గురౌతున్నారు. అది నిజం కాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈవీఎంల లెక్కింపు కంటే అరగంట ముందుగా పోస్టల్‌బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తామని, అయితే వాటి లెక్కింపు చాలా సమయం పడుతుందంటున్నారు. శాసనసభ నియోజవకర్గాల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మధ్యాహ్న సమయం దాట వచ్చని, గుంటూరు పార్లమెంట్‌కు మాత్రం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య సమయం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అనేక నియమ నిబంధనలున్నాయి. ఇవి స్థానిక సంస్థల ఎన్నికల్లో వినియోగించే బ్యాలెట్ ఓట్లు లాంటివి కావు. ఉద్యోగులు, దివ్యాంగులు, 85 ఏళ్ల వయస్సు దాటి ఇంటి వద్దనే ఓటు వేసిన వారు, అత్యవసర సేవల్లో ఉన్న వారు, సర్వీసు ఓటర్లు వేసిన ఓట్లు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కవర్ల రూపంలో బ్యాలెట్ బాక్సులలో నిక్షిప్తమై ఉన్నాయి. కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 4న ఉదయం సా్ట్రంగ్‌రూం సీలు తెరిచి హాల్‌లోకి తీసుకొస్తారు. ఏజంట్ల సమక్షంలో బాక్సులు తెరిచి కవర్లను ఓపెన్ చేయడం ప్రారంభిస్తారు. అంతకంటే ముందు రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్‌లు మొత్తం ఎన్ని అనేది అబర్వర్‌కు వివరిస్తారు. పెద్ద కవర్ తెరిచిన తర్వాత డిక్లరేషన్ ఫారం విడిగా ఉండాలి. అలానే ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ వేరే కవర్‌లో ఉండాలి. బ్యాలెట్ పేపర్ ఉన్న కవర్ సీలు తెరిచే ముందు డిక్లరేషన్ ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. డిక్లరేషన్ ఫారం లేకపోయినా, దానిపై అటెస్టింగ్ అధికారి సంతకం చేయకపోయినా, పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఉన్న కవర్ సీరియల్ వేర్వేరుగా ఉన్నా బ్యాలెట్ పేపర్ నిక్షిప్తం అయి ఉన్న కవర్‌ని తెరవకుండానే తిరస్కరిస్తారు. అటెస్టింగ్ అధికారి సీలు లేకపోయినా, పేరు, హోదా లేకపోయినా తిరస్కరించడానికి వీల్లేదు. అన్ని చెక్‌లు అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఉన్న కవర్‌ని ఓపెన్ చేస్తారు. అందులోనూ కొన్ని చెక్స్ చేపడతారు. ఏ అభ్యర్థి పేరు పక్కన టిక్ పెట్టకపోయినా, ఒకరి కంటే ఎక్కువ మందికి టిక్ కొట్టినా, డ్యామేజ్ అయి ఉన్నా వాటిని కూడా తిరస్కరిస్తారు. ఆ తర్వాతే ఓట్ల లెక్కింపు చేపడతారు. ఏజంట్లకు చూపించి అభ్యర్థుల బాక్సులలో వేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి వారీగా వచ్చిన ఓట్లు లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం తిరస్కరించిన వాటి కంటే తక్కువ ఉంటే మరోసారి లెక్కిస్తారు. ఈ తతంగం అంతా పూర్తి అయ్యే సరికి కొన్ని గంటల సమయం పడుతుంది. మరోవైపు ఈవీఎంల లెక్కింపు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమౌతుంది. అవి కౌంటింగ్ టేబుల్స్ మీదకు రాగానే సీలు తెరిచి రిజల్ట్ బటన్ నొక్కుతారు. ఆ వెంటనే ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు ఆ పోలింగ్ బూతలో వచ్చాయనేది తెలుస్తుంది. ప్రతీ అరగంటకు ఒక రౌండ్ లెక్కింపు పూర్తి అవుతుంటుంది. ఈ నేపథ్యంలో ఫలితాల సరళి తొలుత ఈవీఎంలలో వచ్చిన ఓట్ల ద్వారానే తెలుస్తుంది. ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందో అప్పుడు వాటిని తీసుకొచ్చి ఈవీఎం ఫలితాలతో కలిపి ప్రకటిస్తారు.