మేఘాలయ రాష్ట్రంలో ఘోరం జరిగింది. పుట్టగొడుగులు తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్న పిల్లలు చనిపోయారు. ఇక అవే పుట్టగొడుగులు తిన్న ఆ చిన్నారుల కుటుంబ సభ్యులు కూడా తీవ్ర అస్వస్థత బారిన పడ్డారు. ఈ సంఘటన తెలుసుకున్న స్థానికులు.. తీవ్ర అస్వస్థతకు గురైన కుటుంబ సభ్యులను దగ్గర్లోని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులు వెల్లడించారు.
పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. సఫాయ్ గ్రామానికి చెందిన ఓ 12 మంది కుటుంబ సభ్యులు అడవి పుట్టగొడుగులను తీసుకువచ్చారు. అనంతరం వాటిని కూర వండి తిన్నారు. అయితే పుట్టగొడుగులు తిన్న కొద్దిసేపటికే ఆ 12 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా డిప్యూటీ కమిషనర్ బీఎస్ సోహ్లియా వెల్లడించారు. దీంతో అక్కడికక్కడే ఆ 12 మంది కుటుంబ సభ్యుల్లోని ముగ్గురు చిన్న పిల్లలు మరణించినట్లు తెలిపారు. ఇక మిగిలిన 9 మందిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు.
వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందుతోందని.. కానీ వారి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఆ అడవి పుట్టగొడుగులు తిని చనిపోయిన చిన్నారులను రివాన్సక సుచియాంగ్ (8), కిట్లాంగ్ దుచియాంగ్ (12), వాన్సాలన్ సుచియాంగ్ (15) గా అధికారులు గుర్తించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా డిప్యూటీ కమిషనర్ బీఎస్ సోహ్లియా చెప్పారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.