ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం తద్యమని కూటమి అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి జరిగిన ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ కూడా అవసరం లేదని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కూటమి తరఫున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులతో అగ్రనేతలు చంద్రబాబు, అరుణ్ సింగ్, పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో కూటమికి 53శాతం, వైసీపీకి 41శాతం ఓట్లు పోలయ్యాయని తరుణ్ సింగ్ చెప్పారు. ఈ మేరకు తమ వద్ద స్పష్టమైన లెక్కలు ఉన్నాయన్నారు. కౌంటింగ్ రోజు, తర్వాత వైసీపీ మూకలు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందరూ అప్పమత్తంగా ఉండాలని పురందేశ్వరి వారికి సూచించారు. కౌంటింగ్‌లో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, పోలింగ్ రోజు ఇచ్చిన ఫార్మ్ 17-Cను ఏజెంట్లు అందరూ కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. మూడు పక్షాల ఏజెంట్లు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని, పోటీ చేసిన అభ్యర్థులు కేంద్రాలకు తప్పనిసరిగా వెళ్లాలని ఆదేశించారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించే అంశంలో అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు చంద్రబాబు సూచించారు. ఇటీవల పోస్టల్ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అందరూ జాగ్రత్తగా చూడాలన్నారు. అందరూ రాజ్యాంగ, చట్టబద్ధంగా వ్యవహరించాలని ప్రత్యర్థులు రెచ్చగొట్టినా సమన్వయంతో ఉండాలన్నారు.