బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబీకులపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కూటమి ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..... సమతానగర్‌లో టీడీపీ శ్రేణులపై దాడి, అలాగే రిమ్స్‌లో జరిగిన గొడవలో బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని దౌర్జన్యం చేశారన్నారు. అలాగే పోలింగ్ రోజున వెంగముక్కలపాలెంలో ఆయన కోడలు కావ్యశ్రీ దాడి చేశారని తెలిపారు. పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి, రౌడీషీటు ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల పోలీసులు 137 మందిపై రౌడీషీట్లు తెరిచారని, అందులో 62మంది టీడీపీ వారు ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో రౌడీయిజం చేసి టీడీపీ శ్రేణులపై దాడులు చేసిన బాలినేని కుటుంబంపై పోలీసులు ఎందుకు రౌడీషీట్ తెరవలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎస్పీ, డీఎస్పీ, ముగ్గురు సీఐలు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. రిమ్స్ దాడిలో వైసీపీ శ్రేణులు రెండు వేలమంది పాల్గొన్నట్లు బాలినేని స్వయంగా వెల్లడించారని, ఆధారాలతో సహా తాము పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదన్నారు. బాలినేని స్వయంగా, మీడియా సాక్షిగా దాడి ఘటనపై మాట్లాడినా పోలీసుల నుంచి చర్యలు కరువయ్యాయని మండిపడ్డారు. ఘర్షణతో సంబంధం లేని వారిపై రౌడీషీట్లు తెరవడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఎప్పుడూ గొడవలు చేయలేదన్నారు. కనీస విచక్షణ లేకుండా వైసీపీ శ్రేణులతో కలిసి బాలినేని, ఆయన తనయుడు నేరుగా రిమ్స్‌లోకి వచ్చి రోగులను భయబ్రాంతులకు గురిచేశారని, ఆ విషయాన్ని ఆధారాలతో సహా తాము పోలీసులకు అందజేశామన్నారు. దీనిపై సీరియస్‌గా దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రైవేటు కేసు వేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని టీడీపీ భావించిందని, అందుకోసం తాము సహకరించామన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసుల సహకారంతో రౌడీయిజం చేసిన వైసీపీ శ్రేణుల్లో ఎవరినీ వదిలిపెట్టమన్నారు. ఘర్షణలకు సంబంధం లేని వారిపైనా పోలీసులు ఉద్దేశపూర్వకంగా రౌడీషీట్లు తెరిచారన్నారు. వారు భయపడాల్సిన అవసరం లేదని, టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. హైకోర్టు ద్వారా రౌడీషీట్లు తొలగించేందుకు కృషిచేస్తానని, పార్టీశ్రేణులు అధైర్యపడొద్దని దామచర్ల తెలిపారు. రెండురోజుల్లో ఎన్నికల కౌంటింగ్ ముగుస్తుందని, కచ్చితంగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని స్పష్టం చేశారు. ఒంగోలులో అత్యధిక మెజారిటీతో తాను గెలవబోతున్నానని జనార్దన్ ధీమా వ్యక్తం చేశారు.