ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జనసేన నేత నాగబాబు స్పందించారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భారీ మెజార్టీ అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిలబడిన 21స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలవడం అనేది పవన్ కల్యాణ్‌పై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. నాగబాబు మాట్లాడుతూ "పవన్ కల్యాణ్‌ను గెలపించేందుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా రాష్ట్ర అభివృద్ధిలోనూ పవన్ బాధ్యత తీసుకుంటారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీ తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. ప్రజలతో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ తన సొంత డబ్బుతో ఆయన సాయం అందించారు. ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్ మావాడు అని భావించారు. అందుకే ఇంత ఘన విజయం సాంధించాం. రాష్ట్ర క్యాబినెట్‌లో జనసేన భాగస్వామ్యం అవుతుంది. పవన్‌కు మంత్రి పదవి అనేది నా పరిధిలో లేదు. మా అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం. వైసీపీ వాళ్లు అధికారం రాజులుగా భావించి ప్రజల్ని బానిసలుగా చూశారు. ప్రజలే రాజులు, మేమే సేవకులం అనే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. సినిమా అనేది ఒక పరిశ్రమ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాని అభివృద్ధికి కృషి చేస్తాం. రెండు రాష్ట్ర ప్రభుత్వాలనూ కలిసి అవసరమైన సహకారం కోరతాం. వైసీపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను కొంతవరకు ఇబ్బంది పెట్టింది. రానున్న కూటమి ప్రభుత్వం ఫిల్మ్ ఫ్రెండ్లీగా ఉంటుందనే నమ్మకం మాకుంది. మేము ఆ పరిశ్రమ ద్వారానే ఎదిగాం, దాని అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం" అని అన్నారు.