వివిధ నామినేటర్ పదవుల్లో ఉన్న వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఏపీలో వైసీపీ దారుణ పరాజయం చవిచూసిన నేపథ్యంలో, రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. సజ్జలతో పాటు మరో 20 మందికి పైగా సలహాదారులు రాజీనామా చేశారు. వారు తమ రాజీనామా పత్రాలను సీఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే... ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు, తన పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న సమాచార పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పీఆర్) కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి... ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మనసు మార్చుకున్నారు. తనను ఈ పదవి నుంచి రిలీవ్ చేయాలంటూ ఆయన తాజాగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక, ఇవాళ సీఎస్ కు రాజీనామా లేఖలు పంపిన వారిలో జాతీయ మీడియా అడ్వైజర్ దేవులపల్లి అమర్, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.