మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా జిల్లా గుడివాడలోని ఆయన ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని కొడాలి నాని గతంలో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని తన సవాల్‌ను నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత నేత పొట్లూరు దర్శిత్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే గుడివాడ వన్‌టౌన్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదంటూ వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోకపోవటంతో పోలీసులు, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది.
ఈ క్రమంలోనే కొంతమంది టీడీపీ కార్యకర్తలు పోలీసులను తోసుకుని కొడాలి నాని ఇంటివైపు పరుగులు తీశారు. నాని ఇంటి ఎదుట జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అనంతరం టపాసులు కాలుస్తూ డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ కేకలు వేశారు. ఈ క్రమంలోనే మైక్ పట్టుకుని కొంతమంది పరుష పదజాలం ఉపయోగించారు. గుడివాడలో కొడాలి నానికి కౌంట్‌డౌన్ స్టార్ అయిందన్న టీడీపీ కార్యకర్తలు.. ఇది ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితే.. రాజకీయ సన్యానం చేస్తానని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిన కొడాలి నాని తానే ఓడిపోయాడంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు 2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి వైసీపీ తరుఫన పోటీ చేసిన కొడాలి నాని.. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో పరాజయం పాలయ్యారు. 2004 నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తున్న కొడాలి నానికి ఈ సారి ఓటమి తప్పలేదు. వెనిగండ్ల రాము చేతిలో 50 వేల పైచిలుకు ఓట్ల తేడాతో కొడాలి నాని ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ హంగామా సృష్టించాయి.