మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువు దీరనుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబు నాయుడు యాక్షన్‌లోకి దిగారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందే.. తన టీమ్‌ను రెడీ చేసుకునే పనిలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి పేషీలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను శుక్రవారం బదిలీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ్ భరత్ గుప్తాలను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోకముందే సీఎం పేషీ ప్రక్షాళనకు చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులను ఒక్కొక్కరిగా సాగనంపే పనిలో చంద్రబాబు ఉన్నారు. నిన్నటి వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి ఇప్పటికే లీవ్ తీసుకున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సీఎంవోలో కీలకంగా వ్యవహరించిన పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాను బదిలీ చేసిన ఏపీ సీఎస్..ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. కేవలం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
మరోవైపు జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అమరావతి ప్రాంతంలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో సభ నిర్వహణ కోసం అనువైన ప్రాంతాన్ని టీడీపీ శ్రేణులు పరిశీలిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మరిన్ని బదిలీలు ఉండే అవకాశం ఉందని సమాచారం.