ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు తమ కూటమికి 400 కు పైగా సీట్లు వస్తాయని.. సొంతంగా తామే 370 స్థానాలు సాధిస్తామని ప్రచారం చేశారు. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత అది కాస్తా భారీగా పడిపోయింది. బీజేపీ కేవలం 240 స్థానాల్లోనే గెలుపొందగా.. ఎన్డీఏ కూటమికి 292 స్థానాలు వచ్చి మెజార్టీ ఫిగర్‌ను దాటేసింది. ఈ క్రమంలోనే 2014, 2019 లో బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ దాటి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ఈసారి మాత్రం అలా సాధ్యం కాలేదు. దీంతో మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
1989 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనను గుర్తు చేశారు. మెజార్టీ స్థానాలు రాకపోవడంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటుకు ప్రయత్నాలు చేయకూడదని సూచించారు. అంతేకాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి 197 స్థానాలు మాత్రమే వచ్చాయి. అయితే మెజార్టీ సీట్లు రాకపోవడంతో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజీవ్ గాంధీ ఇష్టపడలేదు. కేంద్రంలో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరగా రాజీవ్ గాంధీ తిరస్కరించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ తమ పార్టీకి రాలేదని.. ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదని రాజీవ్ గాంధీ సమాధానం ఇచ్చారు.
అయితే ఆ సమయంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంతో.. ఆ తర్వాత అధిక సీట్లు సాధించిన ఇంకో పెద్ద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా పిలుపువచ్చిందని సచిన్ పైలట్ తెలిపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత జనతాదళ్ పార్టీ అత్యధికంగా 143 స్థానాలను గెలుచుకుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు రాజీవ్ గాంధీ సుముఖంగా లేకపోవడంతో.. ఆ సమయంలో జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు వీపీ సింగ్ ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రధానమంత్రి పదవిలో వీపీ సింగ్ 11 నెలలు మాత్రమే కొనసాగారు. 1989 డిసెంబర్ 2 వ తేదీన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వీపీ సింగ్.. 1990 నవంబర్ 10 వ తేదీన పదవి నుంచి వైదొలిగారు.
అయితే ప్రస్తుతం నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి కూడా మెజార్టీ స్థానాలు రాలేదని.. అందుకే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని సచిన్ పైలట్ అన్నారు. బీజేపీని ప్రజలు తిరస్కరించారని ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయని.. కాబట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని తెలిపారు. అంతేకాకుండా మందిర్-మసీదు, హిందూ-ముస్లిం, మంగళసూత్రం అంటూ బీజేపీ, నరేంద్ర మోదీ చేసిన ఎన్నికల ప్రచారాన్ని ప్రజలు అంగీకరించలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రులను జైల్లో పెట్టడం, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం వంటివి నరేంద్ర మోదీ చేశారని విమర్శించారు. ఇలాంటి వాటిని ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఫెయిల్ అయిందని చెప్పారు.