మాజీ మంత్రి కొడాలి వేంకటేశ్వరరావు అలియాస్ నాని అనుచురులు కబ్జాచేసిన దాదాపు రూ.100 కోట్లకుపైగా విలువైన స్థలాన్ని బాధితులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో మళ్లీ టీడీపీ విజయం సాధించడంతో చైతన్య సహకార సంఘం ప్లాట్ల యజమానుల్లో ధైర్యం వచ్చింది. మొత్తం 7.66 ఎకరాల్లో వేసిన 60 మందికి చెందిన ప్లాట్లను కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు కబ్జా చేశారు. తమ ప్లాట్ల కోసం వెళ్లిన యజమానులపై రౌడీలతో దాడులు చేయించారు. దీనిపై బాధితులు కోర్టును ఆశ్రయించగా.. అనుకూలంగా తీర్పు వచ్చింది.
అయినాసరే, కబ్జాదారులు ఆ స్థలాన్ని ఖాళీచేయలేదు. నాని వర్గీయులకు భయపడి అధికారులు కూడా చర్యలు తీసుకోడానికి వెనుకాడారు. బాధితుల్లో 18 మంది హైకోర్టుకు వెళ్లారు. వారిలో కొందరు తామూ వైఎస్ఆర్సీపీకి చెందినవాళ్లమేనని, మా స్థలాలు ఇప్పించాలని నాని వద్దకు వెళ్లి వేడుకున్నారు. కానీ, ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. 20 ఏళ్ల కిందట ధరకు కొంటామని, ఇష్టమైతే ఇవ్వండి లేకుంటే వెళ్లిపోండని ఆయన ఇచ్చారని బాధితులు అప్పట్లో వాపోయారు.
ఈ విషయలో గుడివాడ సివిల్ కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఫలితాలు అనుకూలంగా రావడంతో బాధితులకు ధైర్యం వచ్చింది. దీంతో శనివారం ఆక్రమిత స్థలంలోని కంచెను జేసీబీలతో తొలగించి స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న షెడ్డును కూల్చివేసి.. అనంతరం కొడాలి నాని అరాచకం నశించాలంటూ నినాదాలు చేశారు. తమ స్థలాన్ని కొడాలి నాని అనుచరుడు, ఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల కాళీ గ్యాంగ్ కబ్జా చేసిందని బాధితులు ఆరోపించారు. గుడివాడ మండలం వలివర్తిపాడులోని రీసర్వే నెంబర్ 180 చైతన్యనగర్ హౌసింగ్ సొసైటీలోని ఫ్లాట్లను కబ్జా చేశారు.
తమ పిల్లల భవిష్యత్తు కోసం కొన్న భూమిని నాని తన అనుచరులతో కబ్జా చేశాడని బాధితులు మండిపడ్డారు. తమ స్థలాలను కబ్జాకోరుల నుంచి కాపాడాలని అధికార యంత్రాంగం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. ఇక, ఆశలు వదులుకున్న వేళ ఎన్నికల్లో నాని ఘోరంగా ఓడిపోవడం, టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తమకు న్యాయం చేశారని హర్షం వ్యక్తం చేశారు.