నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని క్రమంగా విస్తరించి, చురుకుగా మారినట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాలో కొన్ని ప్రాంతాలకు, ఉత్తరాంధ్రలో కొద్దిభాగం వరకూ విస్తరించినట్టు పేర్కొంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని చెప్పింది. ఇదే సమయంలో తూర్పు-పశ్చిమంగా విస్తరించిన ద్రోణి దక్షిణ కోస్తా మీదుగా పయనిస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో శనివారం వర్షాలు కురిశాయి.
రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్ బలంగా ఉండడంతో తీరం వెంబడి గంటకు 45- 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులు పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆదివారం విజయనగరం,మన్యం,అల్లూరి, కర్నూలు,నంద్యాల,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. ఉరుములతో వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు,పశువులు, గొర్రెల కాపరులు చెట్లు కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది.