తండ్రికి సాయం చేసేందుకు వెళ్లిన ఆ ఇద్దరు కుమారులను మృత్యువు కబళించింది. విద్యుత్ షాక్ రూపంలో వారిని బలితీసుకొంది. ట్రాలీ ఆటోకు సర్వీసు వైరు తాకడంతో రెప్పపాటులో పిల్లలు విగతజీవులయ్యారు. తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చారు. ఈ విషాద ఘటన గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు గ్రామంలో చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన శీలం గోపీకృష్ణ అదే గ్రామంలో న్యూ గోపాలకృష్ణ సప్లయర్స్ నడుపుతున్నారు. గిద్దలూరులోని హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీప వీధిలో ఒక గృహప్రవేశానికి తన సప్లయర్స్ నుంచి వంట, షామియానా సామాను సరఫరా చేశాడు. గృహప్రవేశం ముగిసిన తర్వాత తిరిగి సామానును ముండ్లపాడుకు తీసుకు వెళ్లాల్సి ఉంది. దీని కోసం గోపీకృష్ణ కుమారులు లోహిత్‌కృష్ణ(18), సాయికృష్ణ(16) ఆటోను తీసుకుని గిద్దలూరు వచ్చారు. అక్కడి సామానంతా ఆటోలో నింపుకొని ముండ్లపాడు బయల్దేరారు. కొద్దిదూరం వెళ్లగా ఓ ఇంటి కోసం ఏర్పాటు చేసిన సర్వీసు తీగ ఆటోలోని సామానును తాకింది. దీంతో ఆటో ట్రాలీలోని సామనుపై ఉన్న సాయికృష్ణ విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. ఇది చూసి ఆటో నడుపుతున్న లోహిత్‌కృష్ణ డోర్ తీసి కిందకు దిగడంతో ఎర్త్ పాస్ అయి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అన్నదమ్ములిద్దరూ అక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న గోపీకృష్ణ దంపతులు, బంధువులు ఒక్కసారిగా కుప్పకూలిపో యారు. విగతజీవులై పడివున్న కుమారులను చూసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు.