ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ అమలు కోసం చిత్తూరు జిల్లా మహిళలు ఎదురు చూస్తున్నారు. నేడు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం తర్వాత ఈ పథకం అమలు గురించి ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇందువల్ల జిల్లాలో రోజుకు 32 వేల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. మహిళల ఉచిత ప్రయాణం అమలుపై జిల్లాలోని ఉన్నతాధికారులు ఇప్పటికే తగిన కసరత్తు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో సాధారణంగా రోజుకు 30 శాతం మంది మహిళలు ప్రయాణిస్తున్నారని అంచనా. జిల్లాలోని 5 డిప్లో 371 బస్సులు ఉన్నాయి. ఇందులో ఆర్టీసీకి చెందినవి 326 కాగా 45 అద్దె బస్సులు. ఈ బస్సుల్లో జిల్లాలో రోజుకు 1.15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో సుమారు 32 వేల మంది మహిళలుంటారు. వీరందరికీ ఉచిత ప్రయాణం ఉపయోగపడనుంది. ఉచిత టికెట్టు నమోదుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నారు. ఆధార్ కార్డులోని చివరి నాలుగు అంకెలను నమోదు చేసి, జీరో టికెట్ ఇవ్వనున్నారు. ఎక్స్‌ప్రె్‌సల్లోనూ ఉచితం వర్తిస్తుందా లేదా అనే స్పష్టత లేదు కానీ జిల్లాలో ఉన్న 221 పల్లెవెలుగు బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణం ఉంటుంది.