ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేసారు. ఆయనతో పాటు జనసేనాధినేత పవన్ కళ్యాణ్ సహా మొత్తం 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేసారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక 01:15 గంటల సమయంలో ఈ మంత్రుల జాబితాను ప్రకటించారు. ఇందులో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి చోటు దక్కింది. నారా లోకేష్, పవన్‌తో పాటు మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తదితరులు తొలిసారి ఎమ్మేల్యేలుగా గెలిచారు. ఆ పది మందితో పాటు మరో ఏడుగురు కొత్తవారికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్థన్ రెడ్డి తదితరులు గతంలో పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు కానీ.. మంత్రివర్గంలో ఎప్పుడూ చోటు దక్కించుకోలేదు. కానీ.. తొలిసారి వీరికి ఆ అవకాశం లభించింది. అంటే.. ఓవరాల్‌గా మొత్తం 17 మంది కొత్తవాళ్లు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. జనసేనకు మూడు, బీజేపీకి ఒక స్థానం కల్పించారు. ఓ స్థానాన్ని మాత్రం ఇంకా ఖాళీగా ఉంచారు. గత కొన్ని రోజుల నుంచి మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేసిన చంద్రబాబు.. సీనియర్లు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ ఈ జాబితాను రూపొందించారు.