ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్.. మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో పాటుగా మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ ప్రమాణస్వీకారోత్సవంలో ఓ సన్నివేశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సభా వేదికపైకి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ మహిళా నేత తమిళిసై అప్పుడే వచ్చారు. వేదికపైకి వచ్చిన తమిళిసై అక్కడే కూర్చుని ఉన్న వెంకయ్యనాయుడు, అమిత్ షాలకు నమస్కరిస్తూ వెళ్లబోయారు.
కేంద్రమంత్రి అమిత్ షా తమిళిసైను వెనక్కు పిలిచారు.. ఆమెకు ఏదో చెబుతూ సీరియస్ అయ్యారు. తమిళిసై మధ్యలో కలగజేసుకుని ఏదో చెప్పబోతుండగా.. అమిత్ షా అడ్డుకుని వారించారు. అమిత్ షా తమిళిసైపై సీరియస్ కావడంతో ఈ వీడియో హైలైట్ అయ్యింది. అలాగే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళిసైకు అమిత్ షా వార్నింగ్ ఇచ్చారంటూ కొందరు సోషల్ మీడియాలో ఈ వీడియోను ట్వీట్ చేస్తున్నారు. తమిళిసై అమిత్ షా మధ్య జరిగిన సంభాషణ ఏంటి?.. ఒక్కసారిగా అమిత్ షా ఎందుకు సీరియస్ అయ్యారు అంటూ చర్చ జరుగుతోంది.
లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. అలాగే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. తమిళనాడులో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు.. అయితే తమిళిసై అన్నామలైకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విషయం అమిత్ షా తమిళిసైతో ప్రస్తావించినట్లుగా సోషల్ మీడియాలో కొందరు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపైనా ఇద్దరి మధ్య సంభాషణ జరిగి ఉండొచ్చంటున్నారు.