టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరుల సమక్షంలో చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశారు. ఆంధ్ర ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రమాణం చేసిన చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఐదేళ్ల తర్వాత బాబు సీఎంగా ప్రమాణం చేయడంతో తెలుగు తమ్ముళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుక ఎన్నో ఉద్వేగభరితమైన దృశ్యాలకు, మరెన్నో ఆసక్తికర సంఘటనలకు వేదికైంది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతోపాటు మెగా-నందమూరి ఫ్యాన్స్‌కు ఎంతో సంతోషాన్ని పంచిన ఈ వేడుకకు సంబంధించిన కొన్ని హైలెట్స్ మీకోసం..
చంద్రబాబు తర్వాత జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం ప్రధాని మోదీ, చంద్రబాబుల దగ్గరకు వెళ్లి ఆశీస్సులు పొందిన ఆయన.. వేదికపై ఉన్న తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కాళ్లు మొక్కి ఆశీర్వాదం పొందారు. పవన్ ప్రమాణం చేస్తుండగా.. ఆయన సతీమణి అన్నా లెజినోవా సంతోషంగా ఫోన్లో వీడియో తీస్తూ కనిపించారు.
పవన్ కళ్యాణ్ తర్వాత నారా లోకేశ్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ సమయంలో వేదిక కింద ముందు వరుసలో లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ కనిపించారు. ఎంతో కాలంగా పరిచయం ఉన్న వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం తన తండ్రి చంద్రబాబు నాయుడి కాళ్లు మొక్కిన లోకేశ్ అనంతరం ప్రధాని మోదీకి కూడా పాదాభివందనం చేయబోయారు. కానీ ఆయన వారించారు. అనంతరం లోకేశ్ అమిత్ షా కాళ్లు మొక్కబోగా.. ఆయన సైతం వారించారు.
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది సమయం ముందు ఆయన సతీమణి నారా భువనేశ్వరి వేదికపైకి వచ్చారు. ఇది గమనించిన ఆమె సోదరుడు నందమూరి బాలకృష్ణ.. భువనేశ్వరి దగ్గరకు వచ్చి ఆమ నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి వెళ్లారు. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ఈ దృశ్యం అద్దం పట్టింది.
చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తయ్యేంత వరకు ప్రధాని మోదీ వేదికపైనే ఉన్నారు. అంతే కాదు మంత్రుల ప్రమాణం ముగిసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నూతన మంత్రి పవన్ కళ్యాణ్‌లతో కలిసి ప్రధాని మోదీ అభివాదం చేశారు. మోదీకి ఓవైపు చిరు, మరోవైపు పవన్ ఉండగా.. ముగ్గురూ కలిసి చేతులు పైకెత్తి అభివాదం చేశారు. అనంతరం సోదరులిద్దరితో ప్రధాని ఏదో విషయం ముచ్చటించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుకలో ఇది హైలెట్‌గా నిలిచింది.
మెగా బ్రదర్స్‌తో మోదీ అభివాదం.. ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం
మొత్తానికి చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార మహోత్సవ వేడుక టీడీపీ, జనసేన శ్రేణుల్లో జోష్ నింపింది. నారా, మెగా కుటుంబాలు కలిసిపోయిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.