విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. సంస్థ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, ఈ నేపథ్యంలో జీతాలు ఆలస్యమవుతున్నాయని యాజమాన్యం చెబుతోంది. మరోవైపు నిధులు ఇవ్వలేమని చేతులెత్తేయడంతో విశాఖ విమల విద్యాలయం మూతపడింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులను వివిద ప్రాంతాలకు టూర్లకు పంపించేందుకు యాజమాన్యం అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై విమర్శలు వెల్లుత్తుతున్నాయి. సంస్థ ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో ఇలాంటి అనవసర ఖర్చులను ప్రోత్సహించడమేమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌లోని కీలక విభాగంలోని 36 మందిని ఈ నెల 19నుంచి 21వరకు మూడు రోజుల టూర్‌కు అనుమతులు మంజూరు చేయడంతో కార్మిక సంఘ నాయకులు మండిపడుతున్నారు. విమాన ప్రయాణం మినహా ఇతర మార్గాలు లేని ప్రదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో రూ.లక్షల్లో ఖర్చులవుతాయని, జీతాలు ఇవ్వలేని సమయంలో ఇలాంటి వృథా ఖర్చులు అవసరమా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.