ఏజెన్సీలో నైరుతి ప్రభావం కొనసాగుతున్నది. ఏజెన్సీ వ్యాప్తంగా శుక్రవారం ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెదబయలు మండలం సిరసపల్లి కూడలి వద్ద ఓ చెట్టుపై పిడుగు పడడంతో అక్కడ ఉన్న ఓ ఆవు మృతి చెందింది. ఏజెన్సీ వ్యాప్తంగా ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సాధారణ వాతావరణం కొనసాగింది. ఆ తర్వాత నుంచి ఆకాశం మేఘావృతమై వాతావరణంలోని మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో కారుమబ్బులు కమ్ముకుని ఒక్కసారిగా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం మొదలైంది. సమారుగా రెండు గంటల పాటు వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరులో ఒక మోస్తారు వర్షం కురవగా.. స్థానిక ఘాట్ మార్గంలో పలు మండలాల్లో మాత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలయమం కాగా పంట పొలాల్లోకి వర్షం నీరు భారీగా చేరింది. తాజా వర్షాలు వేసవి దుక్కి పనులకు అనుకూలిస్తాయని రైతులు అంటున్నారు. అలాగే హుకుంపేటలోని రాళ్లగెడ్డ, పాడేరులోని బుంగాగెడ్డ, చిలకలమామిడిగెడ్డ, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో మత్స్యగెడ్డ, డుంబ్రిగుడలో చాపరాయిగెడ్డ వర్షం నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీలో ముసురు వాతావరణం కొనసాగడంతో వాతావరణం చల్లబడింది.