ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి రికార్డు విక్టరీ తర్వాత ఆ పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఐదేళ్ల పోరాటం తర్వాత ఊహించని స్థాయిలో విజయం దక్కటంతో టీడీపీ, జనసేన శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏకంగా 164 సీట్లు కైవసం చేసుకుని టీడీపీ కూటమి అధికారంలోకి రావటం.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించడంతో ఆ పార్టీల కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఒకట్రెండు చోట్ల ఈ సంబరాలు కాస్త శ్రుతి తప్పుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో టీడీపీ, జనసేన కార్యకర్తలు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ గవర్నమెంట్ అధికారితో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పించారు. అంతటితో ఆగకుండా ఆయనతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేయించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.
అసలు వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డీఈ ఇంటి ముందు బుధవారం టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎలక్ట్రికల్ డీఈ ఇంటి ముందు నిరసన తెలిపిన రెండు పార్టీల కార్యకర్తలు..చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయనతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లకు క్షమాపణలు చెప్పించారు. ఆ తర్వాత వారి చిత్రపటాలకు పాలతో అభిషేకం చేయించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి పొరపాటున పోస్టులు పెట్టానంటూ సదరు డీఈ మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే టీడీపీ, జనసేన పార్టీలు విపక్షంలో ఉన్నప్పుడు సదరు డీఈ అనుచిత పోస్టులు పెట్టారని టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యా్ణ్‌ను విమర్శిస్తూ అనుచిత పోస్టులు పెట్టారని మండిపడుతున్నారు. పద్ధతి మార్చుకోవాలని గతంలో ఒకట్రెండుసార్లు చెప్పినా వినలేదంటున్నారు. అందుకే ఆయన ఇంటి వద్ద గాంధేయ పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపినట్లు చెప్పారు. అధికారులు ఎవరైనా ఇలాంటి పోస్టులు పెట్టి ఉంటే తొలగించాలని హెచ్చరించారు. లేకపోతే ఇదే పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తామని అన్నారు.