ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఘన విజయం దక్కింది.. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయగా.. 135 స్థానాల్లో విజయం సాధించింది.. 9 స్థానాల్లో ఓడిపోయింది. అయితే రాయలసీమలో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఓటమిపై అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు. తనను కలిసిన ఆ రెండు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు తెలుగు దేశం పార్టీ గెలుస్తుందనుకుంటే.. ఆ రెండు చోట్ల ఓటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాజంపేటలో టీడీపీ ఓటమిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.చంద్రబాబును రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కలిశారు.. ఓటమికి గల కారణాలపై నివేదికను అధినేతకు సమర్పించారు. ఎన్నికల సమయంలో తనతో పాటుగా పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే నారా లోకేష్ కూడా ప్రచారం చేశారని.. రాజంపేటను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా సరే అక్కడ టీడీపీ ఓడిపోవడం ఏంటని ప్రశ్నించారు. మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న చోట ఓడిపోవడం ఏమిటని ప్రశ్నించారు.
రాజంపేటలో టీడీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన బాలసుబ్రహ్మణ్యం చంద్రబాబుకు వివరించారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో చాలా మంది హడావుడి చేశారని.. కానీ పార్టీ కోసం పనిచేయలేదని చెప్పుకొచ్చారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో.. మొదటి నుంచి టీడీపీలో కొనసాగుతున్నవారికి ప్రాధాన్యం లేకుండా పోయిందన్నారు. అందుకే పార్టీకి నష్టం జరిగిందని.. కొందరు వైఎస్సార్‌సీపీ కోసం పనిచేశారన్నారు. రాజంపేటలో ఓడిపోతామనే భయంతో.. వైఎస్సార్‌సీపీ భారీగా డబ్బులు ఖర్చు చేసిందని సుబ్రహ్మణ్యం చెప్పారట. ఆయన చెప్పిన వివరణపై స్పందించిన చంద్రబాబు.. తనకేమాత్రం సంతృప్తికరంగా లేదని చెప్పారట.
అంతేకాదు ఇటీవల అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి కూడా అధినేత చంద్రబాబును కలిశారు. అక్కడ టీడీపీ ఓటమిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట.. టీడీపీ గెలుస్తందుకున్న స్థానాన్ని పోగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారట. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పార్టీకి చెందిన కొందరు నేతలు పనిచేయకపోవచ్చని తాను ముందే చెప్పాని.. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని తాను సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. తనను ఓడిస్తే తంబళ్లపల్లె నియోజకవర్గ బాధ్యతలు తమకు వస్తాయనే కొందరు ఇలా తన గెలుపు అవకాశాలను దెబ్బ తీశారని జయచంద్రారెడ్డి వివరించారట. ఈ విషయాలన్నీ తనకు తెలుసని.. ఇక నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని సూచించారట. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలను.. జయచంద్రారెడ్డికి చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది.