ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైఎస్సార్సీపీ.. ఐదేళ్లు తిరిగే సరికి 11 సీట్లకు పరిమితమైంది. ఈ ఫలితాలు జగన్‌ను, ఆయన పార్టీ శ్రేణులు విస్మయానికి గురి చేశాయి. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, రెండుకి రెండు ఎంపీ సీట్లు గెలుచుకొని వంద శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేసింది.
వైఎస్సార్సీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజమండ్రి జైలుకు వెళ్లిన చంద్రబాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్.. వెంటనే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీని కూడా ఆయనే పొత్తుకు ఒప్పించారు. జగన్ గుర్తు పెట్టుకో వైఎప్సార్సీపీ అధ పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని ఛాలెంజ్ చేసిన జనసేనాని.. అన్నట్టుగానే ఆ పార్టీని చిత్తుగా ఓడించారు.
ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత జూన్ 12న మంత్రిగా ప్రమాణం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నేడు (జూన్ 19)న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ అనే నేను అనే హ్యాష్ ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండ్ అయ్యింది. అయితే కొందరు మాత్రం.. పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించేలా పోస్టులు పెడుతున్నారు. రాష్ట్రం విడిపోయాక ఇప్పటి దాకా డిప్యూటీ సీఎంలుగా పని చేసిన వారి జాబితాను ఓ నెటిజన్ పోస్టు చేశాడు. నిమ్మకాయల చినరాజప్ప మొదలు.. పవన్ కళ్యాణ్ వరకు మొత్తం 11 మంది జాబితాను రాసుకొచ్చాడు. అంటే రాష్ట్రానికి పవన్ పదకొండో ఉప ముఖ్యమంత్రి అని పరోక్షంగా ప్రస్తావించాడన్నమాట.
ఇది చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఘాటుగానే బదులిస్తున్నారు. 2014-19 మధ్య ఏపీకి ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా పని చేయగా.. జగన్ హయాంలో ఏక కాలంలో ఐదుగురు (కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మొత్తం 8 మంది) డిప్యూటీ సీఎంలుగా వ్యవహరించారు. ఈసారి పవన్ కళ్యాణ్‌కు మాత్రమే డిప్యూటీ సీఎం పదవిని చంద్రబాబు కట్టబెట్టారనే విషయాన్ని ఆయన ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. జగన్‌కి 11 సీట్లిచ్చి, పవన్ 11వ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు అంటూ పవన్ అభిమాని ఒకరు సదరు నెటిజన్‌కు కౌంటర్ ఇచ్చారు. ఈ పదకొండో డిప్యూటీ సీఎం వల్లే జగన్‌కు 11 సీట్లు వచ్చాయంటూ.. సదరు నెటిజన్‌కు పవన్ ఫ్యాన్స్ ఘాటుగా బదులివ్వడం మొదలుపెట్టారు. మొత్తానికి జగన్, పవన్ ఇద్దరికీ ఈసారి పదకొండో నెంబరే అన్నమాట..!