బిడ్డ ఆరోగ్యం కోసం ఆ తండ్రి పడే తపన చూసి అందరి కళ్లు చెమర్చాయి. విశాఖపట్నం కేజీహెచ్‌లో ఇలా.. తన బిడ్డను కాపాడుకోవాలని ఆ తండ్రి పరుగులు పెడుతూ కనిపించారు. కాకినాడ జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీషకు నెలలు నిండకుండానే పురిటి నొప్పులు వచ్చాయి.. వెంటనే కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. ఆమె నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బిడ్డను నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచాలని డాక్టర్లు సూచించార. ఆ బిడ్డకు తల్లి గర్భం లాంటి నియోనేటల్ ఇంటెన్సివ్ యూనిట్‌లో ఉంచడం ద్వారా సాధారణ జననం లాంటి సౌకర్యాన్ని బిడ్డకు అందిస్తారు.
ఆ బిడ్డను పిల్లల వార్డుకు అనుబంధంగా ఉండే ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించడంతో.. ఆ పసికందును వెంటనే ఆ వార్డు కు తరలించారు. బిడ్డను తరలించే సమయంలో సమయానికి అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కన్న బిడ్డను కాపాడుకోవాలని ఆక్సిజన్ సిలిండర్‌ను తండ్రి విష్ణుమూర్తి భుజాన మోసుకుని నర్సు వెంటే ఎన్ఐసీయూ పరుగుపెట్టాడు. బిడ్డ కోసం ఆ తండ్రి పడిన కష్టాన్ని అక్కడే ఉన్న ఒక వ్యక్తి మొబైల్‌లో వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారగా.. ఆ తండ్రి పరిస్థితిని చూసి అందరి కళ్లు చెమర్చాయి. బిడ్డ ఆరోగ్యం కుదుటపడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేజీహెచ్ సూపరెంటెండెంట్ డాక్టర్ శివానంద్ స్పందించారు. వెంటనే సంబంధిత వార్డు వైద్యులు, సిబ్బందిని పిలిచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ఇక నుంచి ఇలాంటి వాటికోసం బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు.