టెక్కలి పరిధిలోని నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పలువురు తమ సమస్యలపై మంత్రికి అర్జీలు అందజేశారు. వైసీపీ నాయకుల బెదిరింపుతో తాము రాజీనామాలు చేశామని, మానవతా దృక్పథంతో మళ్లీ తమను వలంటీర్లగా కొనసాగించాలని టెక్కలికి చెందిన పలువురు వలంటీర్లు మంత్రిని కోరారు. ‘గత ఐదేళ్లుగా జగనన్న.. జగనన్న అంటూ భజన చేయడం గుర్తుందా. ఎవరైతే మీ మెడపై కత్తిపెట్టి రాజీనామా చేయమన్నారో వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. అప్పుడు రండి చూద్దామంటూ’ మంత్రి వలంటీర్లతో చెప్పారు. తమను ఆదుకోవాలని పలువురు చంద్రన్న బీమా మిత్రలు, ఉత్తరాంధ్ర తెలగ కులస్తులను బీసీ జాబితాలో చేర్చాలని ఆ సంఘ నాయకులు పి.వెంకటరమణ, శివారు ప్రాంతాలకు సాగునీరు అందించాలని టెక్కలి, నందిగాం మండలాలకు చెందిన పినకాన అజయ్‌కుమార్, పోలాకి చంద్రశేఖర్ మంత్రికి అర్జీలు అందజేశారు. టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి మండలాల్లో ఎత్తిపోతల పథకాల ట్రాన్స్‌ఫార్మర్లలో రాగివైరు, డీపీ ఆయిల్ చోరీకి గురైందని, వాటికి మరమ్మతులు చేపట్టి ఖరీఫ్‌కు సాగునీరు అందించాలని పలువురు రైతులు కోరారు. అలాగే, తమ సమస్యలపై విద్యార్థులు, రేషన్ డీలర్లు, ఆశవర్కర్లు, పలు శాఖల అధికారులు, ఉద్యోగులు వినతులు అందజేశారు.