దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువకుడ్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. బర్గర్ కింగ్ ఔట్‌లెట్‌లో యువకుడిపై విచక్షణారహితంగా దుండుగులు కాల్పులు జరిపారు. ఒకటి రెండు కాదు కసితీరా 40సార్లు కాల్చి చంపారు. అప్పటి వరకూ కస్టమర్ల మాదిరిగా కూర్చున్న నిందితులు.. ఒక్కసారి యువకుడ్ని వెనక నుంచి కాల్చారు. ఊహించని ఈ ఘటనతో అక్కడున్న కస్టమర్లు కేకలు వేస్తూ భయంతో బయటకు పరుగులు తీశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా.. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఢిల్లీ రాజౌరి గార్డెన్‌లోని బర్గర్ కింగ్ స్టోర్‌కి బాధితుడు అమన్ జూన్ (26).. ఓ యువతితో వచ్చాడు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ఉండగా... ఆ యువతి తన మొబైల్ ఫోన్‌లో ఓ వ్యక్తి ఫోటోను చూపిస్తోంది. వారి పక్కనే కూర్చున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. సరిగ్గా అదే సమయంలో కాల్పులు ప్రారంభించారు. దీంతో అమన్ బిల్ కౌంటర్ వైపు పరుగులు తీయగా.. వెంటాడి మరీ కాల్చారు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో నిలబడి కాల్పులు జరిపిన ఈ వీడియో ఒళ్లుగగ్గుర్పాటుకు గురిచేస్తోంది. ఇక, యువకుడి పక్కనే కూర్చున్న మహిళ.. కాల్పుల శబ్దం వినబడగానే బయటకు పారిపోయింది. దాదాపు 38 రౌండ్లు కాల్పులు జరిపిన నిందితులు.. రెండు తుపాకులు వాడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఘటనా స్థలిలో ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం హంతకుల వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే..2020లో హరియాణాలో జరిగిన ఓ హత్యకు ఇది ప్రతీకారంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
అమన్‌ను యువతి పక్కా ప్లాన్‌తోనే బర్గర్ కింగ్ స్టోర్‌కి రప్పించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ హత్యలో ఆమె పాత్ర కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకీ నేర చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. అమన్ మొబైల్‌తో పాటు అతడి వ్యాలెట్‌ను తీసుకుని ఆమె పరారయ్యింది. మరోవైపు, ప్రస్తుతం పోర్చుగీసులో ఉన్న గ్యాంగ్‌స్టర్ హిమాన్షు తానే ఈ హత్య చేయించినట్టు సోషల్ మీడియాలో ప్రకటించాడు. తన సోదరుడు శక్తి దాదాను అమన్ చంపేశాడని, అందుకు ప్రతీకారంగా అమన్‌ని హత్య చేయించానని పేర్కొన్నాడు. తన సోదరుడి హత్య వెనుక ఉన్న ఎవర్నీ వదిలిపెట్టనని, త్వరలోనే మిగతావాళ్లను చంపుతానని హెచ్చరించాడు. ఢిల్లీ, హరియాణాలో హిమాన్షు గ్యాంగ్ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జైల్లో ఉన్న గ్యాంగస్టర్ నీరజ్ భావనాకు అతడు ముఖ్య అనుచరుడని పేర్కొన్నారు.