దశాబ్దాలుగా మూతపడిన కోలారు బంగారు గనుల్లో (కేజీఎఫ్) తవ్వకాలను పునఃప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం నిర్వహించిన క్యాబినెట్ భేటీల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేజీఎఫ్‌లో మళ్లీ తవ్వకాలను ప్రారంభించాలని కేంద్రం చేసిన ప్రతిపాదనలకు సిద్ధ రామయ్య సర్కారు ఆమోదం తెలిపింది. కోలార్ జిల్లాలోని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న 13 టెయిలింగ్ డంప్‌లలో కార్యకలాపాల కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కర్ణాటక ప్రభుత్వం.. అదే సమయంలో బీజీఎల్‌కు చెందిన 2,330 ఎకరాలను ప్రతిపాదిత పారిశ్రామిక టౌన్‌షిప్‌కు బదిలీ చేయాలని కోరింది.
క్యాబినెట్ సమావేశం అనంతరం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంఎండీఆర్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతి అవసరం కాబట్టి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ‘‘కేజీఎఫ్‌లోని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (బిజిఎంఎల్) మైనింగ్ ఏరియాలో 1,003.4 ఎకరాల విస్తీర్ణంలో 13 టైలింగ్ డంప్స్ ఏరియాలో గనుల, ఖనిజాల నియంత్రణ అభివృద్ధి (ఎంఎంఆర్డీ) చట్టం సెక్షన్ 17 కింద కింద గనుల తవ్వకాలు కొనసాగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది’’ అని పేర్కొన్నారు.
కేజీఎఫ్‌లో తవ్వకాలు మొదలైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వాటంతట అవే వస్తాయని మంత్రి పాటిల్ అన్నారు. బీజీఎల్‌కు చెందిన 2,330 ఎకరాల భూమిని ప్రతిపాదిత టౌన్‌షిప్ కోసం బదిలీ చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. అయితే, 2022-23 వరకు కర్ణాటకకు రూ. 75,24,88,025 బకాయిలను బీజీఎల్ చెల్లించాల్సి ఉందని అన్నారు. ఈ బకాయిలను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని స్పష్టం చేశారు.
ఇక, ప్రపంచంలోనే బంగారు ఖనిజాలు అత్యంత సమృద్ధిగా ఉన్న గనుల్లో కేజీఎఫ్ ఒకటి. అయితే దశాబ్దాల నుంచి ఇక్కడ తవ్వకాలు నిలిచిపోయాయి. మళ్లీ తవ్వకాలు చేపడితే కేంద్రంతో పాటు రాష్ట్రానికి ఆదాయం దండిగా వస్తుంది. ఈ నేపథ్యంలో మైనింగ్ పునరుద్ధరించేందుకు సిద్ధు సర్కారు నిర్ణయించింది. కోలారు, బంగారుపేటె, బంగారదిన్ని పరిసరాల్లో కనీసం 5,213 హెక్టార్ల గనుల్లో తవ్వకాలు చేపట్టనున్నారు. ఈ బాధ్యతను భారత్ గోల్డ్‌మైన్ లిమిటెడ్ (బీజీఎంఎల్)కు మరోసారి కట్టబెట్టారు. 1973 నుంచి ప్రతి 20ఏళ్లకు ఒకసారి కాంట్రాక్ట్ హక్కులను రెన్యువల్ చేస్తున్నారు. మరోసారి ఇదే సంస్థకు ఆ బాధ్యతలు ఇవ్వాలని తీర్మానించారు. కాగా, ఈ గనుల తవ్వకాలు వేల సంవత్సరాల కిందటే ప్రారంభమైంది. దేశంలోనే బంగారు నిధి నిక్షేపాలు అత్యధికంగా ఈ ప్రాంతంలోనే ఉండటం మరో విశేషం.