లోక్‌సభ ఎన్నికలు పూర్తయి.. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే కొత్త లోక్‌సభ కొలువుదీరనున్న నేపథ్యంలో ఇటీవలె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ 17 వ లోక్‌సభను రద్దు చేశారు. 18 వ లోక్‌సభ ఈ నెల 24 వ తేదీ నుంచి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24, 25 వ తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం జరగనుంది. మరోవైపు.. 26 వ తేదీన కొత్త స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. అయితే సభలో సీనియర్ అయిన ఎంపీని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. తాజాగా 18 వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశా నుంచి 7 సార్లు ఎంపీగా గెలిచిన భర్తృహరి మహతాబ్ ఉంటారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
ఒడిశాలోని కటక్ నుంచి భర్తృహరి మహతాబ్ ఏడుసార్లు విజయం సాధించారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్‌సభ ప్రిసైడింగ్ అధికారిగా భర్తృహరి మహతాబ్ కార్యకలాపాలు నిర్వహిస్తారని కిరణ్ రిజిజు వెల్లడించారు. 18 వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారని పేర్కొన్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కె.సురేష్.. డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ టీఆర్ బాలుతోపాటు తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ.. బీజేపీకి చెందిన ఎంపీలు రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తే ఛైర్‌పర్సన్‌ల ప్యానెల్ సహాయంగా ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందే భర్తృహరి మహతాబ్ బిజు జనతాదళ్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరారు. తన సొంత నియోజకవర్గం కటక్ నుంచి బీజేపీ తరఫున పోటీచేసి ఏడోసారి ఘన విజయం సాధించారు. మరోవైపు.. 18 వ లోక్‌సభ సమావేశాలు ఈ నెల 24 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24, 25 తేదీల్లో కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం జరగనుంది. జూన్ 26 వ తేదీన స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.