ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, హస్తిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించిన ఆనందం అంతలోనే ఆవిరయ్యింది. రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్‌కు బెయిల్‌ను సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ని విచారించిన ఉన్నత న్యాయస్థానం.. కింది కోర్టు బెయిల్‌పై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు బెయిల్ మంజూరు కావడంతో కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలవుతారని భావించారు. కానీ, అంతలోనే హైకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సాధారణ బెయిల్ లభించిన విషయం తెలిసిందే.రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి న్యాయ్ బిందు ఆదేశించారు. తీర్పును పైకోర్టులో అప్పీలు చేయడానికి వీలుగా 48 గంటలపాటు నిలిపివేయాలన్న ఈడీ వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. విచారణకు సహకరించాలని, సాక్షుల్ని ప్రభావితం చేయరాదని కేజ్రీవాల్‌కు షరతులు విధించింది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.
ఈడీ మాత్రం సహ నిందితుల నుంచి వచ్చిన డబ్బుతో కేజ్రీవాల్‌కు సంబంధం ఉందని వాదనలు వినిపించింది. 2021 నవంబరు 7న గోవాలోని ఓ హోటల్లో కేజ్రీవాల్ బస చేసినప్పుడు ఆయన తరఫున బిల్లును చెల్లించిన చరణ్‌ప్రీత్ సింగ్ కూడా ఈ కేసులో నిందితుడేనని పేర్కొంది. వివిధ మార్గాల ద్వారా చరణ్‌ప్రీత్‌కు రూ.45 కోట్లు నగదు వచ్చిందని ఆరోపించింది. అంతేకాదు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎన్నిసార్లు సమన్లు జారీచేసినా ఉద్దేశపూర్వకంగా విచారణకు రాలేదని పేర్కొంది. తొమ్మిదిసార్లు అలా జరిగినా తాము అరెస్టు చేయలేదని తెలిపింది.
కేజ్రీవాల్ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో సవాల్ చేసిన ఈడీ.. అర్జెంటుగా విచారణ చేపట్టాలని కోరింది. దీంతో జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దుడేజాల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. మరో 10 లేదా 15 నిమిషాల్లో కేసు తమ వద్దకు వస్తుందని, విచారణ చేపడతామని పేర్కొంది. అప్పటి వరకూ ట్రయల్ కోర్టు ఆర్డర్ అమలు నిలిపివేయాలని స్పష్టం చేసింది. మరోవైపు, కేజ్రీవాల్ సతీమణి సునీతా, ఆప్ కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జైలుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలకాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ, ఇంతలోనే కోర్టు తీర్పు రావడం గమనార్హం. మరోవైపు, ఢిల్లీలో నీటి సంక్షోభంపై కూడా ఆప్ నిరసనలకు పిలుపునిచ్చింది.