నేడు ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్నారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్. ప్రతి 42 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని.. మధుమేహం, బీపీ గురించి చెప్పుకున్నంత బహిరంగంగా.. ప్రజలు తమ మానసిక ఆరోగ్య సమస్యలను, సవాళ్లను చర్చించడానికి ఇష్టపడటం లేదన్నారు. పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో యోగా, ధ్యానం ఎంతో తోడ్పడతాయన్నారు. ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన బహుమతి యోగా.. నేటి మానవాళికి ఒక వరమని నిరూపించబడిందన్నారు. యోగా, ధ్యానాల అపారమైన ప్రయోజనాలను ప్రపంచం నలుమూలలకు విస్తరించడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు.
యోగా బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మించడంతో పాటుగా, శారీరకంగా దృఢంగా, మానసికంగా స్థిరంగా ఉంచుతుందన్నారు రవిశంకర్. ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్నవారికి సైతం యోగా వలన ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలను నివారించడమే కాక, వాటికి పరిష్కారాలు కూడా యోగా చూపుతుందన్నారు. యోగా మనసుకు ప్రశాంతతను, స్పష్టతను ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నారు. యోగా వలన మనసు ఉల్లాసంగా ఉంటుందని.. బుద్ధి కూడా పదునెక్కుతుందన్నారు. ఇటువంటి స్థితిని ఎవరు కోరుకోరు?.. మన శక్తిసామర్థ్యాలను, ఉత్సాహాన్ని అధిక స్థాయిలో ఉంచేందుకు యోగా సహాయపడుతుందన్నారు.
ప్రపంచ యోగా దినోత్సవం
యోగఃకర్మసు కౌశలమ్
'మనం చేసే పనిలో నైపుణ్యమే' యోగా అన్నారు రవిశంకర్. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని.. 'ఏ పరిస్థితిలోనైనా మన భావాలను ఎంత బాగా వ్యక్తీకరించగలం, ఎంత ఉన్నతంగా వృవహరించగలం, అనేదే యోగా' అన్నారు. సృజనాత్మకత, అంతర్ దృష్టి, చేసే పనిలో నైపుణ్యం, మెరుగైన భావ వ్యక్తీకరణ - ఇవన్నీ యోగా యొక్క ప్రభావాలుగా అభిప్రాయపడ్డారు. విభిన్న పరిస్థితులలో సామరస్యాన్ని యోగా పెంపొందిస్తుందని.. యోగా అనే పదానికి అర్ధం ఏకం చేయడం - జీవితంలోని, మన అస్తిత్వం లోని విభిన్న అంశాలను ఏకం చేయడమేనన్నారు. మనం మాట్లాడే పదాల కన్నా, మన స్పందనల ద్వారానే ఎక్కువ విషయాలను తెలియజేస్తామన్నారు. 'యోగా మన స్పందనలను సానుకూలంగా మార్చుతుందని.. మనమందరం మన మనస్సులను శాంతింపజేసుకుని, మన అంతరంగంలోకి ప్రయాణించినపుడు, మన చుట్టుపక్కల సానుకూలమైన స్పందనల క్షేత్రం ఏర్పడుతుంది' అన్నారు. ఇప్పుడు ఇది చాలా అవసరమన్నారు.
ప్రపంచ యోగా డే
శారీరక భంగిమలు, వ్యాయామాలు యోగాలో భాగమే అన్నారు గురుదేవ్ రవిశంకర్. కానీ యోగా అంటే కేవలం వ్యాయామానికి మాత్రమే పరిమితమని తప్పుగా అర్ధం చేసుకోకూడదన్నారు. ఇది మానవ జీవితం యొక్క సమగ్ర అభివృద్ధి, పరిపూర్ణ వికాసం, అనంతమైన దైవ్యత్వంతో అనుసంధించబడటమన్నారు. ప్రతి శిశువూ ఒక యోగి.. యోగులకు ఉండే అన్ని లక్షణాలనూ శిశువు ప్రదర్శిస్తుందన్నారు. యోగ భంగిమలు, శ్వాస విధానం, గ్రహణ సామర్థ్యం, చురుకుదనం, వర్తమాన క్షణంలో ఉండగల సామర్థ్యం - అన్నిటినీ శిశువు మనకు చూపుతుందన్నారు.
'యోగాతో, మనం మన నిజ స్వభావంలోకి తిరిగి వస్తాము, జీవితంలోని సానుకూల అంశాలను చూడటం ప్రారంభిస్తాము' అన్నారు. సాకులు వెదకడానికి, నెపాన్ని ఇతరులపై నెట్టడానికి బదులుగా, ఆయా పనులు నిర్మాణాత్మకంగా ఎలా చేయవచ్చో అని ఆలోచిస్తామన్నారు. ప్రతి కార్యాచరణ రంగంలోనూ ఇది అవసరం అన్నారు. 'నిరాశా నిస్పృహలు అంతటా అలముకున్నపుడు, మనకు అవసరమైన చైతన్యాన్ని, అంతర్చేతనను, మనలోని సహజమైన సామర్థ్యాన్ని యోగా వెలికితీస్తుంది' అన్నారు.
యోగా, ప్రాణాయామం సాధన చేయండి, ముఖ్యంగా, సాధన చేసినాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, అనంతరం ధ్యానం చేయాలని సూచించారు రవిశంకర్. 'ధ్యానం, ప్రాణాయామం లేని యోగా కేవలం శారీరక వ్యాయామమే అవుతుందని.. యోగాలోని ఎనిమిది అంగాలైన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులను సమగ్రంగా మన జీవితంలో భాగం చేసుకున్నపుడు, మన జీవితంలో ఒక మౌలికమైన మార్పును చూస్తాము'అన్నారు. బలహీనత నుండి శక్తికి, దీనత్వం నుంచి సాధికారతకు, దుఃఖం నుండి ఆనందానికి, ఆరోగ్యానికి మనం పయనిస్తామన్నారు.
యోగా మార్గంలో నడవాలంటే ప్రత్యేక సూత్రాలను పాటించాలని లేదన్నారు రవిశంకర్. 'మీరు ఏ (మత, ఆచార) విశ్వాసాలను, లేదా ఏ (యోగ) శాఖను అనుసరిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, యోగా మీ జీవితానికి ఒక అమూల్యమైన వరంగా నిలుస్తుంది' అన్నారు. యోగా సాధన చేసే అవకాశం ప్రతీ పొరుడికి అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. 'మనం' పొందిన అంతరంగ శాంతిని అందరితోనూ తప్పక పంచుకోవాలి అన్నారు గురుదేవ్ రవిశంకర్.