సభలో హుందాతనంతో ముందుకు వెళ్లాలని, వెకిలితనం, వెకిలి మాటలకు ఇక స్వస్తి అని చంద్రబాబు స్పష్టం చేశారు. చట్ట సభలు విలువ తెలిసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడని, ఆయన నాయకత్వంలో సభ హుందాతనం పెరుగుతుందని ఆశిస్తున్నట్టు చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి విషయానికి వస్తే రాజధాని కట్టాలని, అలాగే పోలవరం నిర్మాణంతో పాటు నదుల అనుసంధానం, పేదల అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఈ సభలోనే చేపట్టాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ‘‘నేను శాసనసభలో సీనియర్ సభ్యుడిని. మొత్తం 16 సభలు జరగ్గా 9 సభల్లో ఉన్నాను. 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. నా జీవితంలో 15వ శాసనసభలో జరిగినట్లు ఎప్పుడూ జరగలేదు. సభ గౌరవాన్ని పెంచేలా సభ్యులు వ్యవహరించాలి. అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో సభ హుందాగా నడుస్తుందనే నమ్మకం ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని అయ్యన్న కాపాడతారు’’ అని చంద్రబాబు అన్నారు.