దేశవ్యాప్తంగా నీట్, నెట్ సహా పలు పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్నాల లీకేజీలు వ్యవహారం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో పేపర్ లీక్‌కు పాల్పడినవారిపై చట్టపరంగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం 2024ను తీసుకొచ్చింది. ఈ చట్టం జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు శుక్రవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి ఈ చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలోనే చేశారు. కానీ, సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో అమలు తేదీని ప్రకటించలేదు.
నీట్, నెట్ వివాదంపై గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనిపై మాట్లాడారు. చట్టం గురించి న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని, త్వరలో నోటిఫై చేస్తామని మీడియా ప్రతినిధులకు బదులిచ్చారు. ఆయన ప్రకటన చేసిన24 గంటల్లోనే ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీచేయడం గమనార్హం.
గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. చట్టవిరుద్ధంగా పరీక్ష పత్రాలను అందుకున్నా, ప్రశ్నలు, సమాధాలు లీక్ చేసినా, పరీక్షకు హాజరయ్యేవారికి అనుచిత సాయం చేసినా, సాంకేతికత సాయంతో కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహణ, నకిలీ హాల్‌టిక్కెట్లు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. అందుకు బాధ్యులైవారికి కనీసం మూడేళ్ల.. గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇందులో భాగస్వాములైనవారు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. అంతేకాదు, పరీక్ష నిర్వహణకు అయిన మొత్తాన్ని వారి నుంచి వసూలు చేస్తారు. ఇకపై పేపర్ లీకేజీలపై కొత్త చట్టం కింద నాన్-బెయిల్‌బుల్ కేసులు నమోదు చేయనున్నారు. అధికారుల పాత్ర ఉంటే వారికి మూడేళ్ల జైలు.. రూ.కోటి జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ 2024 విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే 5న నీట్ నిర్వహించిన ఎన్టీఏ.. ఫలితాలను షెడ్యూల్ కంటే 15 రోజుల ముందే ప్రకటించింది. అంతేకాదు, 1,500 మందికిపైగా గ్రేస్ మార్కులు ఇవ్వడం, 67 మంది మంది మొదటి ర్యాంకు రావడం పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో పలువురు విద్యార్థులు కేసులు వేసి... పరీక్షను రద్దుచేయాలని కోరారు. అటు, యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం కూడా పరీక్షకు రెండు రోజుల ముందే లీక్ కావడం గమనార్హం.