అల్లూరి సీతారామరాజు జిల్లాలో అర్ధరాత్రి ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు అడవిలో నిలిచిపోయింది. దీంతో బస్సులో ప్రయాణికులు కొద్దిసేపు భయంతో వణికిపోయారు. విశాఖపట్నం డిపో నుంచి ఆర్టీసీ బస్సు సీలేరు మీదుగా భద్రాచలం వెళుతోంది.. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సాంకేతిక లోపం ఏర్పడింది. బస్సు గూడెంకొత్తవీధి మండలం లంకపాకలు- సప్పర్ల ఘాట్‌రోడ్డులో దట్టమైన అటవీ ప్రాంతంలో ఆగిపోయింది. వెంటనే డ్రైవర్ ఏం జరిగిందని గమనించాడు.. చిన్న సమస్య వచ్చినట్లు గుర్తించారు.
దీంతో బస్సు గంటసేపు బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అటవీ ప్రాంతం కావడంతో బస్సులో ప్రయాణికులు బిక్కు బిక్కుమంటూ గడిపారు. ఆ సమయంలో బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే బస్సులో లోపాన్ని డ్రైవర్ సరిచేయడంతో గమ్యస్థానానికి చేరుకున్నారు. ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులు తరచూ అటవీ ప్రాంతంలో నిలిచిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ఆ బస్సులకు మరమ్మతులు చేసి మళ్లీ వాటినే నడుపుతుండటంతో ఈ పరిస్థితి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి.. ఈ రూట్‌లో కండిషన్‌లో ఉన్న బస్సులు నడపాలని కోరుతున్నారు ప్రయాణికులు.