పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలని, ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.హనుమారెడ్డి, కె.వీరారెడ్డిలు మాట్లాడుతూ.. అనేక దశాబ్ధాలుగా పశ్చిమ ప్రకాశం పాలకుల నిర్లక్ష్యానికి గురై పూర్తిగా వెనుకబడిందన్నారు. వర్షాధారం మినహా మరో నీటి ప్రత్యామ్నాయం లేని పశ్చిమ ప్రకాశానికి వెలిగొండ ప్రాజెక్టే శరణ్య మన్నారు. కొల్లంవాగు సమీపంలో హెడ్ రెగ్యులేటరీ నిర్మాణ పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయని తక్షణమే పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన ముంపు గ్రామాల బాధితులకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదన్నారు. ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయకపోగా ప్రాజెక్ట్ పూర్తి అయిందని జాతికి అంకితం చేయడం జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. నూతన ప్రభుత్వం ముంపు గ్రామాల బాధితుల ఆవేదనను అర్థం చేసుకొని ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద నిధులను మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి అందె నాసరయ్య, కార్యవర్గ సభ్యులు దేవెండ్ల శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కాశీం, రైతుసంఘం నాయకులు కొండయ్య, వెంకటేశ్వ ర్లు, సాంబశివరావు, రామయ్య, సీపీఐ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.