ఒంగోలు నగర శివారు ప్రాతంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువకుడిని గొంతు కోసి ఎన్నెస్పీ కాలువలో పడవేశారు. ఈ సంఘటన ఒంగోలు నగర శివారు ప్రాతమైన లింగారెడ్డి అపార్ట్‌మెంట్‌కు దగ్గరలో గల అమరావతి ప్లాట్స్ వద్ద సోమవారం వెలుగు చూసింది. సుమారు 30 ఏళ్ళ యువకుడిని గొంతు కోసి కాలువలో వేశారు. ఆప్రాంతంలో తిరుగుతున్న వారు సోమవారం సాయత్రం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు ఒంగోలు డీఎస్పీ కిషోర్‌బాబు, టూటౌన్ సీఐ జగదీష్ తమ సిబ్బందితో వెళ్ళి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన యువకుడుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కాలువ గట్టుపై యువకుడిని అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేసి కాలువలోకి విసిరేసినట్లు సంఘటనా స్థలంలో ఉన్న రక్తపు మరకలను బట్టి పోలీసులు భావిస్తున్నారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున జరిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. గొంతు కోసి పడవేయడంతో త్రీవర రక్తస్రావమై రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. మృతుని వివరాలు తెలయాల్సి ఉందని ఒంగోలు డీఎస్పీ చెప్పారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.