మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చట్టనిబంధనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. మంత్రి హోదాలో ఆయనకు 5+5 సెక్యూరిటీ ఇచ్చారని, ప్రస్తుతం ఆయన సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని, అందుచేత 1+1 భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. మంత్రిగా ఉండగా తనకు ఇచ్చిన 5+5 సెక్యూరిటీని కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పెద్దిరెడ్డి, అలాగే తనకున్న 4+4 భద్రతను కొనసాగించేలా ఆదేశించాలంటూ ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది గుడిసేవ నరసింహారావు వాదనలు వినిపించారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉండగా 5+5 సెక్యూరిటీ ఉండేదని.. ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా భద్రతను తగ్గించారని తెలిపారు. దమ్మాలపాటి వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగబద్ధ పదవులు అలంకరించినవారికి.. ప్రజాప్రతినిధులు, ఇతరులకు భద్రత కల్పించే విషయంలో తగు ఉత్తర్వులు ఉన్నాయని.. వాటికి అనుగుణంగానే అధికారులు నడుచుకుంటున్నారని పేర్కొన్నారు. అదనపు భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా ఎస్పీకి పెద్దిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారని.. అదనపు భద్రత అవసరంలేదని ఎస్పీ అభిప్రాయపడ్డారని, ప్రస్తుత దరఖాస్తు భద్రత రివ్యూ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు. పిటిషనర్లకు ప్రాణహాని ఉందని నిరూపించేందుకు కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు ఉంచలేదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, అందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవరి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేశారు.