గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీటి, సీవరేజ్ ప్రాజెక్టులన్నీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ అధికారులు, 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ సర్కార్ రాక మునుపు పట్టణ ప్రాంతాల్లో తాగునీటి వనరులు అభివృద్ధి, మురుగునీటి వ్యవస్థ పట్టిష్ఠం, ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందించే ఏర్పాట్లు చేసేందుకు ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకు(ఏఐఐబీ) నుంచి రూ.5300 కోట్ల రుణం 2019 ఫిబ్రవరిలో తీసుకున్నామన్నారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు అవసరమైన రాష్ట్ర వాటా చెల్లించకపోవడం, టెండర్లు పిలి చి పనులు అప్పగించడంలో జాప్యం చేయడం, చేసిన పనులకు బిల్లులివ్వకుండా ఆలస్యం చేయడంతో ఐదేళ్లలో రూ.429 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలిచిపోయాయన్నారు. మున్సిపల్‌శాఖలో ఆగిపోయిన పనులను తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. లక్ష లోపు జనాభా కలిగి ఉన్న మున్సిపాలిటీల్లో అమృత్ ప్రాజెక్టుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. అమృత్ 1 ప్రాజెక్టులు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3362 కోట్లు విడుదల చేస్తే రూ.2213 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. అమృత్-2 కింద రూ.8800 కోట్లు మంజూరైతే కేవలం రూ.3600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. సీఎంతో చర్చించి ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర వాటా విడుద ల చేసి ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. జూలై చివరి నాటికి 123 పట్టణ స్థానికసంస్థల్లో కాలువల్లో పూడిక తీసేందుకు రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు నారాయణ వివరించారు. ఏషియన్ డెవల్‌పమెంట్ బ్యాంక్ ద్వారా మురుగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారని, టిడ్కో ఇళ్లతోపాటు, ఒక నెలలో మున్సిపల్ శాఖకు సంబంధించి అన్ని ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహించి 2014-19లో ప్రారంభించిన పనులన్నీ తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.