చిన్నతనంలో స్కూలులో చాలా మంది ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. అందులో కొందరు జీవితాంతం స్నేహితులుగా కొనసాగుతూనే ఉంటారు. చిన్నప్పుడు ఒకరి పక్కన ఒకరు కూర్చొని పుస్తకాల నుంచి భోజనం వరకు అన్నీ షేర్ చేసుకుంటారు. తర్వాత ఎవరి జీవితంలో వారు ఎదిగి ఎంత పెద్ద హోదాలో కొనసాగినా.. బాల్య స్నేహితులు కలిసే ఉంటారు. అయితే దేశానికి అత్యంత కీలకమైన ఆర్మీ, నేవీలకు ప్రస్తుతం చీఫ్‌లుగా ఉన్నవారు కూడా చిన్నతనంలో బాల్య స్నేహితులు కావడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రస్తుతం నేవీ చీఫ్‌గా ఉన్న అడ్మిరల్ దినేష్ త్రిపాఠి.. లెఫ్టినెంట్ జనర్ ద్వివేదిలు చిన్నతనంలో స్నేహితులు కావడం విశేషం.
1970లో మధ్యప్రదేశ్ రేవాలోని సైనిక్ స్కూల్‌లో దినేష్ త్రిపాఠి, ఉపేంద్ర ద్వివేది కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం రోజురోజుకూ పెరిగి ప్రాణస్నేహితులుగా మారారు. ప్రస్తుతం వారు ఒకరు ఆర్మీకి, మరొకరు నేవీకి నాయకత్వం వహిస్తున్నప్పటికీ.. పరస్పరం సలహాలు సంప్రదింపులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు.. తాజాగా ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇద్దరు అద్భుతమైన విద్యార్థులను మిలటరీలో అత్యున్నత సేవలు అందించగలిగే అధికారులుగా తీర్చిదిద్దిన అరుదైన గౌరవం రేవాలోని సైనిక్ స్కూల్‌కు దక్కుతుందని భరత్ భూషణ్ బాబు అభినందించారు.
1964 జులై 1 వ తేదీన పుట్టిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది.. 1984 డిసెంబర్ 15 వ తేదీన సైన్యంలో చేరారు. అనంతరం పలు కీలక పదవుల్లో పని చేసిన ద్వివేది.. నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. తాజాగా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ చేయగా.. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ఆ స్థానాన్ని భర్తీ చేశారు.
రెండేళ్ల పాటు దేశానికి ఆర్మీ చీఫ్‌గా సేవలందించిన జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేశారు. దీంతో జనరల్ మనోజ్ పాండేను సైనిక అధికారులు గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించారు. మనోజ్ పాండే 2022 ఏప్రిల్ 30 వ తేదీన ఆర్మీ చీఫ్‌గా నియమితులు అయ్యారు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం జనరల్ మనోజ్ పాండే.. మే 30 వ తేదీనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. అప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన సర్వీసును ఒక నెల పాటు పొడిగించింది. దీంతో జూన్ 30 వ తేదీన పదవీ విరమణ చేశారు.