మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నును కొంత తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై ప్రస్తుతం ఉన్న ట్యాక్స్‌ను 26 శాతం నుంచి 25 శాతానికి.. డీజిల్‌పై ప్రస్తుతం 24 శాతం ట్యాక్స్ ఉండగా.. దాన్ని 21 శాతానికి తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పెట్రోల్ ధర 65 పైసలు తగ్గగా.. డీజిల్ ధర లీటరుకు రూ.2 తగ్గనుంది. మహారాష్ట్రలో ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన అజిత్ పవార్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
తాజాగా పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్స్ తగ్గించిన తర్వాత ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.21 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.92.15కి తగ్గింది. మరికొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన-బీజేపీ-ఎన్సీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. బడ్జెట్‌లో సంచలన హామీలు ఇచ్చింది. ఇక ఇదే బడ్జెట్‌లో 21 నుంచి 60 ఏళ్ల మధ్య గల అర్హులైన మహిళలకు నెలవారీ రూ. 1500 ఇవ్వనున్నట్లు తెలిపింది. జూలై నుంచి ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకానికి వార్షిక బడ్జెట్‌లో రూ.46 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
మరో సంక్షేమ పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి అజిత్ పవార్ ‘ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన’ కింద అర్హులైన కుటుంబాలకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు లభిస్తాయని చెప్పారు. ఇక మహారాష్ట్రలో పత్తి, సోయాబీన్ పండించే ప్రతీ రైతుకు ఒక హెక్టార్‌కు రూ.5 వేలు బోనస్‌గా చెల్లించనున్నట్లు ప్రకటించారు.