ఏపీలో సోమవారం పండగ వాతావరణం నెలకొంది. ఏపీ ప్రభుత్వం పెరిగిన పింఛన్లను పంపిణీ చేయడంతో అంతటా కోలాహలం నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లబ్ధిదారులతో ముచ్చటించారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్.. భావోద్వేగానికి గురయ్యారు. పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానంటూ ఎమోషనల్ అయ్యారు. మంత్రిగా ఎక్కువ మాటలు చెప్పనని.. ఎక్కువ పనిచేస్తానని చెప్పారు. అలాగే హంగూ, ఆర్భాటాలకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. డబ్బు వెనకేసుకోవాలని ఎప్పుడూ ఆలోచించనని తెలిపారు. అవినీతి చేయనని మాటిస్తున్నానని చెప్పారు. పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖకు కోట్లల్లో అప్పులు ఉన్నాయన్న పవన్.. అందుకే జీతం తీసుకోకుండా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.