ఇచ్చిన హామీలను ఎలాగూ అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి, గొడవలు పెట్టి, భయపెట్టాలని చూస్తున్నారన్నారని నందిగం సురేష్ అన్నారు. పెన్షన్ రూ.7 వేలు అని చెప్పి చాలా చోట్ల రూ.6,500 అలా రకరకాలుగా పంచారన్నారు. పెన్షన్ తీసుకున్న వాళ్లు ఏ విధంగా మాట్లాడుకున్నారో సోషల్ మీడియాలో వచ్చిన క్లిప్పింగ్ లను మీడియాకు నందిగం సురేష్ చూపించారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఓట్లు వేసిన వారిపైన, ప్రతిపక్షాలపైన కక్ష తీర్చుకోవాలని చూస్తోందన్నారు. ఇష్టానుసారంగా పోదాం అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. గత 5 సంవత్సరాల జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో ఎవరిపైనైనా దాడులు చేశారా? ఎవరి ఇళ్లు అయినా పగలగొట్టారా? అని ప్రశ్నించారు. నెల రోజులు కాకముందే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా కొడదాం, భయపెడదాం, టార్చర్ చేద్దాం, వైయస్సార్ సీపీ వాళ్లు ఎవరైనా వదిలిపెట్టేది లేదు, అంతు చూస్తామనడం సరైంది కాదన్నారు. మీకు చేతనైతే ఇలాంటి ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాలన్నారు. నిన్న కూడా ఓ మినిస్టర్ భార్య పోలీసులపై ప్రవర్తించిన తీరు గమనించాలన్నారు. ఏరోజైనా వైయస్ఆర్ సీపీ హయాంలో ఇలాంటి ధోరణిలో బెదిరించారా? అని ప్రశ్నించారు. వేమూరు నియోజకవర్గంలో నిన్నగాక మొన్న వైయస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టారని, ఇలాంటివి సరికాదన్నారు. అల్లరచిల్లరగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, హేయమైన పద్ధతుల్లో కాకుండా రాష్ట్రాన్ని పాలించాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో వ్యతిరేకత మొదలైతే తట్టుకోలేరన్నారు. ఎర్రబుక్కు రాసుకున్నాం కాబట్టి ఎవరినైనా బాధపెడతామంటే అందుకు చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. మహా అయితే కేసులు పెట్టగలరని, రాష్ట్ర ప్రజలు మీరు చేస్తున్న పనులు గమనిస్తూనే ఉన్నారన్నారు. 5 ఏళ్ల తర్వాత ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయని స్పష్టం చేశారు. ఇలాంటి దుశ్చర్యలపై కోర్టులకు వెళ్తామని నందిగం సురేష్ స్పష్టం చేశారు. ఎవరైతే అధికారం చేతపట్టుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారో వాళ్లందరిపైనా ప్రయివేటు కేసులకు కూడా వెళ్తామని హెచ్చరించారు.